
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడు పెంచింది. పార్టీకి సెంటిమెంట్‌గా కలిసొచ్చే పాలమూరు నుంచే శంఖారావం పూరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 లేదా 15న జరగనున్న బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పాల్గొననుండటంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది. పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి స్వయంగా ముఖ్యనేతలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య నాయకులతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నేతలు కూడా హాజరయ్యారు. ఎన్నికల శంఖారావాన్ని స్వయంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనుండడంతో భారీ జనసమీకరణపై దృష్టిసారించారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు నుంచే ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతుండడంతో పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ అధినాయకత్వం పక్క ప్రణాళిక రూపొందించింది.
సెంటిమెంట్‌పై ప్రధాన దృష్టి
పాలమూరు ఉమ్మడి జిల్లాలో గతంలో బీజేపీకి గట్టి పట్టు ఉండేది. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను గెలుపొందిన చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకున్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మొదటగా బీజేపీ నుంచే పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీటును బీజేపీ కైవసం చేసుకుని రాష్ట్రంలోనే సంచలన విజయం నమోదు చేసింది. వీటితో పాటు భారీ సంఖ్యలో స్థానిక సంస్థల స్థానాలు గెలిచిన దాఖలాలున్నాయి. అలాగే పట్టుభద్రుల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఇలా మొత్తం మీద పాలమూరు ప్రాంతం సెంటిమెంట్‌గా బీజేపీ కలిసిరావడంతో ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇక్కడి నుంచే పూరిస్తోంది.
బలమైన స్థానాలపై గురి
ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల సందర్భంగా వచ్చిన ఓట్లు, అంతర్గతంగా పార్టీ చేయించిన సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాలపై బలమైన ఫోకస్ పెట్టింది. పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొంత మంది నేతల జాబితాను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో కల్వకుర్తి, నారాయణపేట, వనపర్తి, మక్తల్, దేవరకద్ర, గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ వంటి అసెంబ్లీ స్థానాలపై గట్టి ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. సదరు నియోజకవర్గాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని యోచిస్తున్నాయి.
కార్యాచరణ ప్రారంభం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం రకరకాల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించేందుకు ప్రణాళిక రచించింది. ఇటీవలి కాలంలో కర్నాటక, త్రిపుర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కార్యాచరణ చేపట్టింది. అక్కడ అనుసరించిన ఫార్ములాకు శ్రీకారం చుట్టింది. పార్టీకి అనుబంధమైన సంఘాలను ఇది వరకే అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఇతర కార్మిక సంఘాలను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. స్థానికంగా ఓటు బ్యాంకును బలోపేతం చేసేందుకు బూత్‌కమిటీలు, శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో గణనీయమైన ఓటు బ్యాంకు సాధించాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతీ బూత్‌లో 5 నుంచి 10 మందితో ఒక కమిటీ, ప్రతీ రెండు బూత్‌లకు కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పక్క ప్రణాళికతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment