
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న సీఎం కేసీఆర్
గాంధారి : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడని బీజేపీ నాయకులు విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పో తంగల్ కిషన్ రావు మండలంలో పలు గ్రామాలు సందర్శించి ఎండిన మొక్కజొన్న, వరి, పంటలను పరిశీలించారు. మండలంలో అధిక శాతం వర్షాధార పం టలను సాగు చేస్తారని అన్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, వరి, పత్తి, సోయాబీన్ తదిర పంటలు ఎండి పోయి రైతు లు పూర్తిగా నష్టపోయారన్నారు.
బోరుబావుల వద్ద సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు విద్యుత్ కోతల కారణం గా ఎండి పోయాయన్నారు. దీంతో రైతు లు పెట్టుబడులు కూడా కోల్పోయి ఆం దోళన చెందుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 8 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అధికారంలోకి రాగానే రోజుకు రెండు గంటలు కూడా సరఫరా చేయడంలేదని ఆరోపించారు. వ్యవసాయానికి కనీసం ఆరు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తే, వారిపై లాఠీచార్జి చేస్తూ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా సరైన చర్యలు తీసుకుని రైతులకు కనీసం ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.