సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తును జిల్లాలోని కమలనాథులు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు విరుద్ధంగా అధినాయకత్వం ‘దేశం’తో జతకట్టడంపై తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారు. పొత్తులో భాగంగా సీట్లు గల్లంతవుతున్న స్థానాల్లో తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. జిల్లా రాజకీయ కేంద్రమైన నిర్మల్ అసెంబ్లీ స్థానం విషయంలో ఇరుపార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ సీటు బీజేపీకి కేటాయించని పక్షంలో బీజేపీ ముఖ్యనాయకత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ‘నిర్మల్‌లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు.
కాబట్టి ఈ సీటు బీజేపీకే వస్తుందని భావిస్తున్నాము. లేని పక్షంలో పార్టీ పదవికి రాజీనామా చేసే విషయం ఆలోచిస్తా..’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. టీడీపీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మిర్జాయాసిన్ బేగ్ (బాబర్) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బాబర్ బరిలోకి దిగినా, మరో టీడీపీ నాయకుడు పోటీ చేసినా బీజేపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థికి సహకరించడం ప్రశ్నార్థకమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
తెలుగు తమ్ముళ్ల తిరుగుబావుటా
టీడీపీ-బీజేపీల పొత్తుపై పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు కూడా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పొత్తులో భాగంగా మంచిర్యాల స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థానానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కొండేటి సత్యం ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్తుండటంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సీటు బీజేపీకి కేటాయించిన పక్షంలో మంగళవారం మూకుమ్మడి రాజీనామా పత్రాలు చంద్రబాబుకు పంపుతామని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రాజేశం, బెల్లంకొండ మురళి ప్రకటించారు. బీజేపీ నుంచి మంచిర్యాల టిక్కెట్‌ను ఇటీవల బీజేపీలో చేరిన కేవీ ప్రతాప్, మల్లారెడ్డి, గోనె శ్యాంసుందర్‌రావు ఆశిస్తున్నారు.
సీట్ల పంపకాలు
పొత్తులో భాగంగా జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ స్థానం టీడీపీకి కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో రా థోడ్ రమేష్‌ను ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు సోమవా రం ప్రకటించారు. కాగా జిల్లాలో ఉన్న పది ఎమ్మెల్యే స్థా నాల్లో నాలుగు బీజేపీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చా యి. ఆదిలాబాద్, ముథోల్, మంచిర్యాల, చెన్నూరు స్థా నాలను బీజేపీకి ఇచ్చేందుకు ప్రాథమికంగా రెండు పార్టీ లు అంగీకరించినట్లు తెలుస్తోంది.నిర్మల్ సీటును కూడా తమకే కేటాయించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీలకు రిజర్వు అయిన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్‌లలో ఏదో ఒక స్థానం బీజేపీకి ఇవ్వాలని పట్టు బడుతున్నారు. సీట్ల పంపకాల్లో స్పష్టత రాకముందే రెండు పార్టీల్లో ఈ స్థాయిలో అసంతృప్తులు రగిలిపోతున్నాయి. ఏ సీటు ఎవరికో తేలాక, సీట్లు గల్లంతయిన నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయోనని అగ్రనాయకులు ఆందోళన చెందుతున్నారు.
2 ‘పొత్తు’ కయ్యం
Published Tue, Apr 8 2014 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement