డాక్టర్ సువర్ణరెడ్డి, డాక్టర్ సువర్ణరెడ్డి, సట్ల అశోక్, డాక్టర్, కొత్తపల్లి శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురి పేర్లను ఖరారు చేసింది. పోటాపోటీగా కొనసాగిన నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ సువర్ణరెడ్డి, ఖానాపూర్‌కు సట్ల అశోక్, సిర్పూర్‌కు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆసిఫాబాద్‌కు ఆజ్మీరా ఆత్మారాం నాయక్‌లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించారు. అక్కడ బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలుపడంతో వారి పేర్లు ఖరారైనట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆదిలాబాద్, బోథ్, ముథోల్, బెల్లంపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మంచిర్యాల, చెన్నూరు సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ నెలకొన్న పోటీ పరిస్థితుల కారణంగానే ఈ రెండింటిలో పేర్లను ప్రకటించలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిర్మల్‌లో ‘సువర్ణా’వకాశం..
రెండునెలల కిందటే పార్టీలో చేరిన స్త్రీవైద్య నిపుణురాలు సువర్ణరెడ్డిని నిర్మల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ రెండేళ్లుగా పార్టీలో ఉంటూ టికెట్ ఆశించిన మరో వైద్యుడు కాలగిరి మల్లికార్జున్‌రెడ్డి చివరి వరకూ పోటీనిచ్చారు. ముందుగా పార్టీ నుంచి వీరిద్దరికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇద్ద రూ గోడరాతలు, ప్రచారం చేపట్టారు. పార్టీ లోని నాయకులు సైతం ఇద్దరి వైపు చీలిపోయి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం కోసం ఎవరికివారు రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీ స్థాయిలో మం తనాలు జరిపినట్లు సమాచారం. చివరకు అధిష్టానం సువర్ణరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, ప్రజల్లో స్త్రీవైద్య నిపుణురాలిగా పేరు ఉండడం, మహిళ కావడం ఆమెకు కలిసి వచ్చింది.
పార్టీలో చేరక ముందు చేపట్టిన సేవా కార్యక్రమాలు, పాదయాత్ర సైతం ఆమె వైపు మొగ్గు చూపడానికి కారణమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మల్లికార్జున్‌రెడ్డి మద్దతుదారులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. పార్టీ నాయకులను కలిసి వచ్చారు. చివరి వరకు తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నానని, ఇలా నిర్ణయం రావడంపై తమ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్మల్‌లో తన అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అందరి నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని స్పష్టంచేశారు. పార్టీ జిల్లా నేతలు మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తామని, ఈసారి నిర్మల్‌లో గెలుస్తామని చెబుతున్నారు.
ఆదివాసీ నేతకు అభ్యర్థిత్వం..
ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒక్కటైన ఖానాపూర్‌లో బీజేపీ ఆదివాసీ నాయక్‌పోడ్ వర్గానికి చెందిన సట్ల అశోక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఉట్నూర్ మండలం లక్సెట్టిపేట గ్రామానికి చెందిన అశోక్ 2007లో ఎంపీటీసీగా, 2014లో సర్పంచ్‌గా పనిచేశారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వనవాసీ కల్యాణ్ పరిషత్‌లో పనిచేసి ఉండడం, యుక్త వయసులోనే రాజకీయ నేపథ్యం, ఆదివాసీ కావడంతో ఇక్కడ ఆయనకు అవకాశం దక్కింది. చివరి వరకు ఇక్కడ సీనియర్ నాయకుడు పెందూర్ ప్రభాకర్ పేరు వినిపించి నా పార్టీ సట్ల అశోక్ వైపు మొగ్గు చూపింది.
సిర్పూర్‌లో డాక్టర్ శ్రీనివాస్..
సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌ను పార్టీ ఖరారు చేసింది. కాగజ్‌నగర్‌లో ఆసుపత్రి ద్వారా వైద్యసేవలను అందిస్తూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగానూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. అనంతరం బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాలను చురుకుగా చేపట్టారు. ఇక్కడ శ్రీనివాస్‌కు పార్టీపరంగా పోటీ లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం సులువుగా ఖరారైనట్లు చెబుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఆసిఫాబాద్‌లో ఆత్మారాం నాయక్..
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఆసిఫాబాద్‌లో ఇటీవల పార్టీలో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్‌కు బీజేపీ అవకాశమివ్వడం ఆసక్తిగా మారింది. రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని కైరిగూడకు చెందిన ఆత్మారాం నాయక్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో నుంచి ఆయన బీజేపీలో చేరారు. నెల వ్యవధిలోపే ఆయనకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. ఇదే లంబాడా సామాజిక వర్గానికి చెందిన సిర్పూర్(టి) జెడ్పీటీసీ సభ్యుడు అజ్మీరా రాంనాయక్ గత ఏడాది క్రితమే టీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్ అభ్యర్థిగా తనకే అవకాశం ఉంటుందన్న ధీమాతో కొనసాగారు. పార్టీ అధిష్టానం మాత్రం ఆత్మారాం నాయక్ వైపు మొగ్గుచూపడం ఆసక్తికరంగా మారింది.
పెండింగ్‌లో మంచిర్యాల, చెన్నూరు
ఉమ్మడి జిల్లాలోనే ముఖ్య నియోజకవర్గంగా పేరున్న మంచిర్యాలతో పాటు పక్కనే ఉన్న చెన్నూరు స్థానాలకు బీజేపీ రెండో విడతలోనూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ప్రధానంగా మంచిర్యాల నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సీనియర్ నాయకుడు ముల్కల్ల మల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ వెరబెల్లి రఘునాథరావు ఆయనకు పోటీగా మారారు. వీరిద్దరి మధ్య టికెట్ కోసం పోటాపోటీ మంతనాలు సాగుతున్నాయి.
మల్లారెడ్డి, రఘునాథరావు వర్గాలు ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ స్థానాన్ని ఖరారు చేయలేదు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోనూ రాం వేణు, అందుగుల శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా ఎవరికి వారు తమవంతుగా పార్టీ అధినాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయింపుల తర్వాత అసమ్మతి తలెత్తేందుకు అవకాశాలు ఉండడంతో పార్టీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment