- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన...రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పరిపాలనా అనిశ్చితి నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2015ను పార్టీ సంస్థాగత పటిష్టతకు వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 20 దాకా ఆన్‌లైన్ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ తర్వాత ఆరు జిల్లాల్లో జరిగే మండలి పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు బీజేపీకి ఒక మంచి అవకాశం అని, వాటిలో గెలిచి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి కోరారు.
ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు:
గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ వచ్చినా సీఎం కేసీఆర్ అభద్రతలో ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీలో తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన, పనిచేసిన చాలామంది ఈ రోజు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని విమర్శించారు.
ఉద్యమ వ్యతిరేకులను మంత్రివర్గంలో నియమించడం ద్వారా ఉద్యమకారులపై కేసీఆర్ పెత్తనం చేయిస్తున్నారని విమర్శించారు. అనంతరం పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ సతీష్‌జీ మాట్లాడారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించగా అందులో రాజకీయ తీర్మానం లేకపోవడంపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ తీర్మానాన్ని అప్పటికప్పుడు తయారుచేసి, ఆమోదించారు. సమావేశంలో పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్.వి.శేషగిరిరావు, రామారావు, ఎన్.రామచందర్‌రావు, సి.రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే:
వెంటనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలను నిర్వహించాలి.
ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. వాస్తుపేరిట సచివాలయం తరలింపు, హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల నిర్మాణం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను వెంటనే ఖర్చుచేయాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ చేపట్టాలి.