
పీఆర్‌సీ బకాయిలపై రచ్చ
- ప్రభుత్వ సమాధానం కోసం బీజేపీ పట్టు
- మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోరుతూ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఆందోళనకు దిగడంతో గురువారం శాసనసభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, రాజాసింగ్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి నిరసనకు దిగారు. పీఆర్‌సీ అమలుకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో శాఖలవారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలులేవని, వేతన స్థిరీకరణ మెమో రాలేదని, గ్రాట్యూటీని రూ.15 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం అంగీకరించిన ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని బీజేపీ సభ్యుడు జి.కిషన్‌రెడ్డి ‘జీరోఅవర్’లో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 నుంచి రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను బాండ్ల రూపంలో కాకుండా జీపీఎఫ్ ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ సమయంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సభలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కె.తారకరామారావులు స్పందిస్తూ ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమాధానమిప్పిస్తామన్నారు. ఈ సమాధానంపై బీజేపీ సంతృప్తి చెందకపోవడం, జీరోఅవర్‌లో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చే సంప్రదాయం లేదని మంత్రులు బదులిచ్చారు. అయినా.. పీఆర్‌సీ బకాయిల అంశంపై సమాధానం కోసం బీజేపీ సభ్యులు పట్టుబట్టి నిరసనగా దిగారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌లు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వమన్నారు. ఎక్కడాలేని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్, ప్రత్యేక ఇంక్రిమెంట్‌తోపాటు ఆరోగ్యకార్డులను జారీ చేశామన్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ ఈ ప్రశ్నను లేవనెత్తిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ స్పందిస్తూ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యకార్డులు నిరుపయోగంగా మారాయని, కార్పొరేట్ ఆస్పత్రులు వీటిని తిరస్కరిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో బాండ్లు సైతం ఇలానే చెల్లవన్నారు. ఆర్థికమంత్రితో సమాధానమిప్పిస్తామని స్పీకర్ నచ్చజెప్పి బీజేపీ సభ్యులతో ఆందోళన విరమింపజేశారు.
జీరో అవర్‌లో ఎవరెవరు..
బహదూర్‌పూర తహసీల్దార్‌పై దాడి చేసినవారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని అహమ్మద్ పాషా ఖాదీ(ఎంఐఎం) ప్రభుత్వాన్ని కోరారు. హెదరాబాద్-విజయవాడ మార్గంలో సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో ఇప్పటివరకు 200 మంది ప్రమాదాలకు గురై మృతి చెందారని వేముల వీరేశం(టీఆర్‌ఎస్) ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కులాల జాబితాలో నేతకాని కులాన్ని నితారిగా పేర్కొనడంతో కుల ధ్రువీకరణపత్రాలు జారీ కావడం లేదని, దీనిని సరిచేయాలని దుర్గం చెన్నయ్య(టీఆర్‌ఎస్) విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్-నర్సి రోడ్డులో ఇరుకుగా మారిన బ్రిడ్జీలతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే షకీల్ అహమద్(టీఆర్‌ఎస్) ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలను రూ.1000 నుంచి రూ.15 వేలకు పెంచాలని, మెస్ చార్జీలను రూ.4.35 పైసల నుంచి రూ.15కు పెంచాలని రవీంద్ర కుమార్(సీపీఐ) డిమాండు చేశారు.