టీడీపీ నేతలకు నాగం క్లాస్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. టీడీపీని వ్యతిరేకించి బీజేపీలో చేరిన నాగం సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి రావడం, అక్కడ పార్టీ నేతలతో కొద్ది సేపు రహస్యంగా చర్చలు జరపడం లాబీల్లో పెద్ద చర్చకు దారితీసింది.
శాసనసభలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై టీడీపీ నేతలకు నాగం ఏకంగా ఒక క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మొదటి రోజున పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మొదట్లో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లీకులిచ్చిన కేసీఆర్ ఆ తర్వాత తన వైఖరిలో మార్పు కనిపించింది. మరీ ముఖ్యంగా మోదీతో కేసీఆర్ భేటీ అయిన తర్వాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ నగదు రహిత లావాదేవీలపై ప్రచారం మొదలుపెట్టారు. మోదీ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో శాసనసభలో కేసీఆర్ పై బీజేపీ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి పొత్తు లేదు. పైపెచ్చి కేసీఆర్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తున్నప్పటికీ మొదటి రోజు అసెంబ్లీలో నోట్ల రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతించడంతో ఇక ఏం మాట్లాడాలో బీజేపీ నేతలకు అర్థంకాలేదు.
తాము ఈ అంశంపై ఎలాగూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం... కనీసం మీరైనా గట్టిగా మాట్లాడండి... అని హితవు చెప్పడానికి బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత నేరుగా తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంలోకి వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలతో పాటు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో నాగం భేటీ అయి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాల్సిన విషయాలపై చర్చించినట్టు తెలిసింది.
సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగిన నాగం ఆ తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీ నేతలతో అది కూడా (పాత) మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన నేతలతో ఆయనకున్న సాన్నిహిత్యంతో టీడీపీ కార్యాలయంలోకి వెళ్లారే తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రధాన్యత లేదని, రాజకీయంగా కూడా ఇరు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నందున ఈ భేటీకి అంతగా ప్రాధాన్యత లేదని నాగం సన్నిహితులు చెబుతున్నారు.