మార్చి 14 లేదా 15న బడ్జెట్‌ | Budget on March 14 or 15 | Sakshi
Sakshi News home page

మార్చి 14 లేదా 15న బడ్జెట్‌

Published Tue, Feb 27 2018 2:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Budget on March 14 or 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్: 2018–19 వార్షిక బడ్జెట్‌ను మార్చి 14 లేదా 15న ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తోంది. పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి వీలుగా సమావేశాలు రెండు వారాలు జరగవచ్చు. పంచాయతీరాజ్‌ కొత్త చట్టం బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ప్రకటించారు. సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావటంతో మరిన్ని జనాకర్షక పథకాలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖల ప్రతిపాదనలు, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ.61,607 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038 కోట్లు కేటాయించింది. ఈసారి భారీ అంచనాలుండటం, ఆదాయ వృద్ధీ ఆశించినంతగా ఉండటంతో భారీ బడ్జెట్‌ను ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రూ.1.8 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 

పెట్టుబడి సాయం.. రైతు బీమా 
రెండేళ్ల కిందట సాగునీటికి స్పష్టమైన కేటాయింపులతో కొత్త అధ్యాయానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాలని నిర్ణయించింది. ఇది బడ్జెట్‌కు అనుబంధంగా ఉంటుంది. సాగుకు రూ.15 వేల కోట్లు కేటాయించవచ్చు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఏడాదికి ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయమందించే పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తోంది. ఈ పథకానికి తొలి ఏడాది రూ.12 వేల కోట్లు కావాలని అంచనా. సీఎం తాజాగా ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, 50 శాతం సబ్సిడీపై నాటు వేసే యంత్రాలు, 75 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు, పంట రుణాలకు వడ్డీ రాయితీ తదితరాల నేపథ్యంలో సాగుకు ఈసారి భారీగా కేటాయింపులుండనున్నాయి. 

సాగునీటికి పెద్ద వాటా 
సాగునీటి ప్రాజెక్టులకు ఈసారీ భారీగా నిధులందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయటంతో పాటు 50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్య సాధనకు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పరిపూర్తి తదితరాలకు రూ.30 వేల కోట్ల దాకా కేటాయించవచ్చు.  

కొత్త పథకాలివే
పాత పథకాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఈసారి బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆసరా పెన్షన్ల మొత్తం, పరిధి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ఆర్థిక సాయం పెంపు, నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి తదితరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుపేద గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే పథకానికీ రూపకల్పన చేస్తోంది. అలాగే జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా ప్రభుత్వమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement