
సాక్షి, హైదరాబాద్: ‘రైతుబంధు’పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నుంచి పెట్టుబడి సొమ్మును రైతులకివ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత 20.93 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందజేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ రైతుల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి శుక్రవారం బ్యాంకులకు అందజేసింది. మొదటివిడత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 3,275 గ్రామాల రైతుల పేర్లను బ్యాంకులకు ఇచ్చింది.
ఎకరాలు, గుంటలు, ఎవరికి ఎంతెంత సొమ్ము వంటి వివరాలతో అత్యంత సెక్యూరిటీ కోడ్‌తో పెన్‌డ్రైవ్, సీడీ, మెయిల్ పద్ధతుల్లో బ్యాంకులకు అందజేసింది. తమకిచ్చిన వివరాల ఆధారంగా రైతుల పేరుతో బ్యాంకులు చెక్కులను ముద్రిస్తాయి. శనివారం నుంచే చెక్కులను ముద్రించే ప్రక్రియను ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐవోబీలు ప్రారంభిస్తాయి. చెక్కులపై వ్యవసాయశాఖ కమిషనర్ డిజిటల్ సంతకం ముద్రిస్తారు. పెట్టుబడి సొమ్మును మూడు విడతలుగా రైతులకు అందజేస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సమస్యలు ఉన్నందున అక్కడి రైతుల పేర్లను బ్యాంకులకు వ్యవసాయశాఖ అందజేయలేదు. మరోసారి పరిశీలించాకే ఆ జిల్లాల సమాచారాన్ని బ్యాంకులకు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment