
7 నుంచి బడ్జెట్ సమావేశాలు
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 27వ తేదీ దాకా జరగనున్నాయి.
11న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి ఈటెల
మార్చి 27 వరకు సమావేశాలు
స్పీకర్, మండలి చైర్మన్‌ల తో సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 27వ తేదీ దాకా జరగనున్నాయి. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ సమావేశాల తేదీల గురించి గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. మార్చి 7 తేదీ ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తొలుత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ శనివారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో సమావేశమై తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. 8, 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-2016 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 11వ తేదీన సభలో ప్రవేశపెడతారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సమాధానం 17వ తేదీన ఉంటుంది. మొత్తంగా 12, 15, 21, 22 తేదీలను అసెంబ్లీకి సెలవులుగా నిర్ణయించారు. తర్వాత 23 నుంచి 27వ తేదీ వరకు వరుసగా సమావేశాలు జరుగుతాయి. కాగా, 27వ తేదీన ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది.
ఈనెల 27 రూల్స్ కమిటీ సమావేశం
అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు అయినా, సభ జరిగే సమయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉదయం 9 గంటల నుంచి కానీ, 9.30 నుంచి కానీ సమావేశాలు మొదలు పెట్టాలన్న చర్చ జరిగింది. అయితే దీనిపై ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఈనెల 27వ తేదీన జరిగే అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుని చెబితే, ఆ ప్రకారమే నిర్వహిద్దామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఆదివారం వచ్చిందని, ఆ రోజు సెలవు ఇస్తే బావుంటుందన్న ప్రతిపాదనను సీఎం తిరస్కరించారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్యమని, ఆదివారాలు, పండుగలు అని చూసుకోవాల్సిన అవసరం లేదని, సమావేశం జరగాల్సిందేనని ఆయన అన్నట్టు తెలిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7వ తేదీ నుంచే ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారని, అయితే వారి తేదీలతో సంబంధం లేదని.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏడు నుంచే మొదలు పెడదామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. స్పీకర్‌తో భేటీ తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్ సమావేశాల తేదీలను వివరించి, 7వ తేదీన ప్రసంగించడానికి రావాల్సిందిగా ఆహ్వానించడం.., గవర్నర్ దానికి అంగీకారం తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి.
సీటింగ్ ఏర్పాట్లు భేష్
అసెంబ్లీ సమావేశ మందిరంలో సీటింగ్ ఏర్పాట్ల పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇరుగ్గా ఉన్న సీట్లను తొలగించి 170 మంది సభ్యులకు సరిపడేలా అధికారులు మరమ్మతులు చేపట్టారు. సీటింగ్ ఏర్పాట్లు బాగా ఉన్నాయని అధికారులను అభినందించిన సీఎం, నాలుగు ద్వారాల నుంచి సమావేశ మందిరంలోకి గ్రీన్ కార్పెట్లు వేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇతర విప్‌లు, ఎంపీ బి.వినోద్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం పాల్గొన్నారు.