పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జిల్లాలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది.వ్యాపార లావాదేవీలు నిలిచి పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలూ బోసిపోయాయి. పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు తీసుకోవడంతో అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.ఆందోళన కారులు ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనంతో తమ నిరసనలను తెలిపారు. రవాణాకు ఇబ్బందులు ఏర్పడడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన తెలంగాణ బంద్‌లో భాగంగా పాలమూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని పెట్రోలు బంక్‌లు, సినిమాథియేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పోలవరం ఆర్డినెన్స్‌పై నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నా చేపట్టాయి.
ఈ బంద్‌కు తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో మహబూబ్‌నగర్ పట్టణంలోనే కాకుండా వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, అచ్చంపేట డిపోల పరిధిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సుల రాకపోకలు జరుగకపోవడంతో జాతీయ రహదారిపై సందడి తక్కువగా కనిపించింది. ఈ మేరకు బస్సులు నిలిచిపోవడం ఆర్టీసీ సంస్థకు గురువారం రావాల్సిన ఆదాయంలో రూ.80 లక్షలు తగ్గినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
పలు చోట్ల ఇలా..!
బంద్ సందర్భంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తెలంగాణ చౌరస్తా, పాతబస్టాండ్, గడియారం చౌరస్తా, వన్‌టౌన్ నుంచి మార్కెట్, బోయపల్లిగేట్, రైల్వేస్టేషన్ చౌరస్తా, రాజేంద్రనగర్ వీధుల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెరచి ఉంచిన వ్యాపార సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. తెలంగాణ పంచాయితీరాజ్ మినీస్ట్రిరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. టీ సీసీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతకుముందు ఆ పార్టీ కార్యాలయం నుంచి శయయాత్ర నిర్వహించారు. బంద్‌కు మద్దతుగా సీపీఎం నాయకులు కొత్తబస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. బంద్‌కు మద్దతుగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పిలుపుమేరకు జిల్లా కోర్టు బార్‌అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.
టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జడ్చర్ల నియోజక వర్గంలో ప్రశాంతంగా ముగిసింది.
వనపర్తిలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ వాదులు నరేంద్ర మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దేవరకద్ర, కొత్తకోట, అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్ మండల కేంద్రాల్లో వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. టీఆర్‌ఎస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని టీఆర్‌ఎస్, ప్రజా సంఘాలు, తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు.
గద్వాలలో మార్కెట్ యార్డు లావాదేవీలు కొనసాగలేదు. వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగానే మూసేశారు.
మక్తల్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ముందుగానే సమాచారం ఉండటంతో వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసి ఉంచారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో బంద్ కొనసాగింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు తగ్గాయి.
సంపూర్ణం
Published Fri, May 30 2014 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement