
అదృశ్యమైన యువకుడు.. శవమై తేలాడు!
ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండురోజుల క్రితం బయటకు వెళ్లిన అతను చివరకు సుంకేసుల ....
► ప్రేమ వ్యవహారమే కారణం : పోలీసులు
► సుంకేసుల బ్యారేజీ నుంచిమృతదేహం వెలికితీత
శాంతినగర్ : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండురోజుల క్రితం బయటకు వెళ్లిన అతను చివరకు సుంకేసుల బ్యారేజీలో శవమై తేలాడు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన రమ, చంద్రారెడ్డి దంపతులకు కుమారుడు పవన్‌రెడ్డి (21), కూతురు ఉన్నారు. సుమారు పదేళ్లక్రితం బతుకుదెరువు నిమిత్తం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు వలస వచ్చారు.
ఆరేళ్లక్రితం మనస్పర్థలు రావడంతో భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుమారుడు స్థానికంగా పాలకేంద్రం, వస్త్ర దుకాణాల్లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ వచ్చాడు. రెండేళ్లక్రితం స్థానిక మీసేవా సెంటర్‌లో ఆధార్ నమోదు ఆపరేటర్‌గా చేరాడు. ఆమె ఈనెల 14న సొంత పనిమీద ఖమ్మంలోని అక్క వద్దకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈనెల 16వ తేదీ రాత్రి వరకు అతను అక్కడ పనిచేసి బయటకు వెళ్లి మంగళవారం ఉదయం వరకు తిరిగిరాలేదు. దీంతో మీసేవా నిర్వాహకుడు రవి ఇరుగుపొరుగు వారిని విచారించాడు. చివరకు రాజోలికి చెందిన జాలర్లు సుంకేసుల బ్యారేజి సమీపంలో పవన్‌రెడ్డి మృతదేహం కనిపించిందని సమాచారమిచ్చారు.
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పుట్టి, జాలర్ల సాయంతో వెలికితీశారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆదివారం సాయంత్రం అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కాగా కాళ్లకు చెప్పులు, వాచ్, ఏటీఎం కార్డు జేబులోనే ఉండటం, ఒడ్డున బైక్ హ్యాండిల్‌లాక్ వేసి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. ఈ మేరకు ఎస్‌ఐ జయశంకర్ కేసు దర్యాప్తు చేపట్టి అనంతరం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.