కేబినెట్‌లో దత్తన్నకు బెర్త్
- ఖాయమంటున్న పార్టీ వర్గాలు
- రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు
- కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీకి..
సాక్షి, సిటీబ్యూరో: కేంద్రంలో నేడు కొలువుదీరనున్న నరేంద్రమోడి మంత్రివర్గంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చోటు ఖాయమైంది. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన పిలుపుతో ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందిన, ఇప్పటికే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. ఈసారీ క్యాబినెట్ ర్యాంక్ పదవి వస్తుందన్న ధీమాతో ఢిల్లీ వెళ్లారు.
1991, 1996, 1999 ఎన్నికలతో పాటు ఆయన తాజా ఎన్నికల్లో 2,54,735 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999 నుండి 2004 వరకు దత్తాత్రేయ వాజ్‌పాయ్ మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. గతానుభవం దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, నరేంద్రమోడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఆదివారమే ఢిల్లీ చేరుకోగా మిగిలిన నాయకులు సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
మల్కాజిగిరి ఎంపీ ఆశలు
తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఏకైక ఎంపీగా గెలుపొం దిన మల్లారెడ్డి కేంద్ర మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆయన ఆదివారమే ఢిల్లీ వెళ్లినా క్యాబినెట్‌లో చోటు లభించే అంశంపై మాత్రం ఆయనకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆయనకు సోమవారం ఏర్పడే మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవచ్చనే అంచనాకు ఆయన సన్నిహితులు వచ్చారు.