మోడీ కేబినెట్‌లో దత్తన్నకు దక్కని చోటు
హైదరాబాద్: నరేంద్రమోడీ కేబినెట్‌లో చోటు ఖాయమని గంపెడాశ పెట్టుకున్న సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు నిరాశే మిగిలింది. తెలంగాణ నుంచి ఎకైక ఎంపీ కావటంతో మంత్రిపదవి తథ్యమని ఆయన భావించారు. కానీ సోమవారం కొలువుదీరిన మోడీ మంత్రి మండలిలో దత్తాత్రేయకు అవకాశం దక్కలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీ వెళ్లారు. మంత్రి పదవి దక్కిన వారి వివరాలేవీ ముందస్తుగా వెల్లడించకపోవటంతో అందరికీ సోమవారం ఉదయమే సమాచారం అందుతుందని తేలిపోయింది. సోమవారం ఉదయం గుజరాత్ భవన్‌లో మోడీ ఏర్పాటు చేసిన టీపార్టీకి పలువురు నేతలకు పిలుపొచ్చింది. వారంతా మంత్రివర్గంలో చోటు దక్కినవారే. దీనికి దత్తాత్రేయను ఆహ్వానించకపోవటంతోనే ఆయనలో అనుమానం బలపడింది. అప్పటికే మోడీ జాబితాను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. ఆ జాబితాలో పేర్లున్నవారందరికీ అక్కడి నుంచి ఫోన్ ద్వారా ఆహ్వానం అందింది. అయితే మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా ఫోన్‌కాల్ రాకపోవటంతో తనకు అవకాశం దక్కలేదని దత్తాత్రేయ నిర్ధారించుకున్నారు.
వెంటనే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను సంప్రదించి విషయంపై ఆరా తీశారు. ప్రస్తుతానికి పరిమిత సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించుకున్నారని, ఈ కారణంగానే చాలామంది సీనియర్లకు కూడా అవకాశం దక్కలేదని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగే విస్తరణలో మరికొంతమందికి అవకాశం ఉంటుందని రాజ్‌నాథ్, దత్తాత్రేయకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మలి విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని దత్తాత్రేయ నమ్మకంతో ఉన్నారు.
మోడీ నుంచి లభించని హామీ: ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దత్తాత్రేయ ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా మోడీని కలిశారు. బీజేపీ భారీ విజయం దక్కించుకున్నందుకు మోడీని అభినందించి తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న మోడీ దత్తన్నకు మంత్రిపదవిపై హామీ ఇవ్వలేదని సమాచారం.