క్యాబినెట్‌లోకి దత్తన్న?
* ఈ విస్తరణలో స్థానం ఖాయమంటున్న అనుచరులు
* సహాయ లేదా ఇండిపెండెంట్ చార్జిపై ఆశలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని మళ్లీ విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలో గ్రేటర్ భారతీయ జనతా పార్టీలో మళ్లీ ఆసక్తికరచర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ తరఫున విజయం సాధించిన ఒకే ఒక్క నేత... సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈమారు మంత్రి పదవి ఖాయమని అభిమానులు, నాయకులు ఆశిస్తున్నారు. గతంలో దత్తాత్రేయకు మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న దృష్ట్యా ఈసారి ఆయనకు ఇండిపెండెంట్ చార్జితో కూడిన పదవిని ఇచ్చే అవకాశం ఉందని సన్నిహితులు అంచనాకు వచ్చారు. ఒక వేళ వయస్సు అడ్డు (68 సంవత్సరాలు)గా భావిస్తే సహా య మంత్రి పదవినైనా కట్టబెడతారని పేర్కొంటున్నారు.
దత్తాత్రేయ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను అప్పజెప్పకుండా ఖాళీగా ఉంచారని, అది కచ్చితంగా క్యాబినెట్‌లో స్థానం కల్పించే సంకేతమేనని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. గురువారం సికింద్రాబాద్ నియోకజవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దత్తాత్రేయ సైతం ముందుంది మరింత మంచికాలం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయటంతో.. ఆయనకు పదవి ఖాయమై ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది.