చక్రపాణికి కన్నీటి వీడ్కోలు
- ఎస్‌పీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
గౌతంనగర్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సరయూ నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం మల్కాజిగిరి ఎస్‌పీనగర్ శ్మశాన వాటికలో బంధు, మిత్రుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. గత నెల 30న అయోధ్యలో నిర్వహించిన సుందరకాండ పారాయణ యాగానికి వెళ్లిన చక్రపాణి నదిలో స్నానం చేస్తూ మృత్యువాత చెందిన విషయం తెలిసిందే.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరిన చక్రపాణి మృతదేహాన్ని మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో మల్కాజిగిరి వాణినగర్‌లోని చక్రపాణి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే అతని తల్లిదండ్రులు కృ ష్ణ కిశోర్‌శర్మ, రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదిం చారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, బంధువులు చ క్రపాణి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు.
అలాగే, స్థానిక కార్పొరేటర్ ఆర్. సుమలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.