
కోటి విలువైన గంజాయి పట్టివేత
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తూ వారు ఔటర్ రింగ్‌రోడ్డుపై పోలీసులకు చిక్కారు. రెండు బొలేరా వాహనాల్లో పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తుండగా అనుమానం వచ్చిన ఔటర్ పోలీసులు ఆపి వాహనాలు తనిఖీ చేస్తుండగా వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు.
బొంగ్లూర్ ఔటర్ రింగ్‌రోడ్డు ఎక్కి ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో కొంగరకలాన్ సమీపంలోని కల్వకోలు లక్ష్మీదేవమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు వాహనాలను ఆపారు. ఔటర్ రింగ్‌రోడ్డు పోలీసులు ఎస్‌ఐ శ్రీనివాస్ బృందం వారిని ఆరా తీస్తుండగా అనుమానం వచ్చింది. వెంటనే వాహనాలు తనికీ చేస్తుండగా ఒక వాహనం తప్పించుకుపోవడాన్ని గమనించి రావిర్యాల్ సమీపంలో పట్టుకున్నారు. వాహనాలు పరిశీలించగా అందులో గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఒక్కో బాక్స్‌లో నాలుగు కేజీల వరకు గంజాయి ఉన్నట్లు తెలిసింది. 25 బాక్సుల్లో మొత్తం 100 కేజీలు ఉండొచ్చని, దాని విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పోలీసులు గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను ఆదిభట్ల పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి ,ఆదిభట్ల సీఐ గోవింద్‌రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి నగరంలోని ఘట్‌కేసర్ ప్రాంతానికి గంజాయి తరలిస్తుం డగా రోడ్డు తెలియక ఈ ముఠా ఆదిభట్ల వైపు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.