
చివరి లబ్ధిదారు వరకు కార్డుల పంపిణీ: మంత్రి ఈటెల
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఆహార భద్రతా కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదనీ, అర్హుడైన చివరి ....
కొత్త కార్డులిచ్చే వరకు పాత కార్డులకు బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఆహార భద్రతా కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదనీ, అర్హుడైన చివరి లబ్ధిదారు వరకు నిరంతరం కార్డులను పంపిణీ చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కొత్త కార్డులు లబ్ధిదారులకు అందేవరకూ పాత కార్డులకు రేషన్ బియ్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. గురువారం చెరువుల పునరుద్ధరణపై సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ ఆహార భద్రతా కార్డుల అంశంపై చర్చించింది. ఈ భేటీ అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం పేరిట ఇస్తున్న కార్డులకు కొత్త నిబంధనలేవీ చేర్చలేదని, పాత నిబంధనలే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా, ప్రతీ పేదవాని కడుపు నింపేలా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బియ్యం సేకరణ విధానం ఖరారు
ఇక బియ్యం లెవీని కేంద్ర ప్రభుత్వం 75శాతం నుంచి 25శాతానికి తగ్గించినా దరమిలా ప్రభుత్వం సైతం కొత్త సేకరణ విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధానాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు సిధ్దం అయింది. దీనిపైనా మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు.
టీడీపీ శవరాజకీయాలు తగదు
షాద్‌నగర్: టీడీపీశవరాజకీయాలు చేస్తోందని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీ-టీడీపీ నాయకులు బస్సుయాత్ర చేస్తూ ప్రజలను, రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారని మండిపడ్డారు.