
చిట్యాల (నకిరేకల్) : రూ.20వేల చిల్లర కోసం వచ్చిన ఓ వ్యక్తి.. క్యాషియర్ పొరపాటున ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన స్థానిక కెనరా బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు నూతనంగా విడుదలైన నోట్లు కావాలని తన వద్ద ఉన్న పది రెండు వేల రూపాయల నోట్లను క్యాషియర్‌కు ఇచ్చాడు. వాటికి చిల్లరగా క్యాషియర్ రూ.20 నోట్లనుకుని క్యాషియర్ పొరపాటును రూ.200 బెండల్‌ను సదరు యువకుడికి ఇచ్చాడు.
యువకుడు ఇచ్చిన రూ.20వేలుపోను.. రూ.లక్షా 80 వేల తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బ్యాంకు లావాదేవీల జమ, ఖర్చుల్లో భారీ తేడాలు రావడంతో.. బ్యాంకు అధికారులు సీసీ పుటేజీలను పరిశీలించారు. పసువు రంగు చొక్కా వేసుకుని, మెడలో నల్లటి బ్యాగుతో వచ్చిన గడ్డంతో ఉన్న యువకుడు క్యాషియర్ కిష్టయ్య పొరపాటున ఇచ్చిన నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మొత్తం క్యాష్ పోవటంతో బ్యాంకు సిబ్బంది తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.