సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐఏఎస్‌లు శ్రీజన తుమ్మల, శివశంకర్ లహోటిలను తాత్కాలికంగా ఏపీలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు వీరి కేటాయింపులపై యథాతథస్థితి కొనసాగించాలని క్యాట్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ విచారణను 25కు వాయిదా వేసింది. ప్రస్తుతం వీరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. చిత్తూరు, విజయనగరం జిల్లాలకు చెందిన వారమైనా హైదరాబాద్ వాసులుగా చూపుతూ తాత్కాలికంగా తెలంగాణకు కేటాయించారని, దీన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ క్యాట్‌ను ఆశ్రయించడంతో వీరిని తాత్కాలికంగా ఏపీలోనే కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. అయితే ఇటీవల తుది కేటాయింపుల్లో వీరిని తెలంగాణకు కేటాయించడంతో మరోసారి వీరు క్యాట్‌ను ఆశ్రయించారు.
డీఐజీ శివప్రసాద్ పిటిషన్‌పై 18న విచారణ: తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 1998 బ్యాచ్‌కు చెందిన డీఐజీ శివప్రసాద్ క్యాట్‌ను ఆశ్రయించారు. తాత్కాలిక కేటాయింపుల్లో తనను తెలంగాణకు కేటాయించి ఇటీవల చేసిన తుది కేటాయింపుల్లో ఏపీకి కేటాయించారని, ఇది నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. తన భార్య, కుమారునికి వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లో తాను ఉండాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనను తెలంగాణకు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాత్కాలికంగా తనను తెలంగాణలోనే కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.
ట్రైనీ ఐఏఎస్‌ల కేటాయింపులపై క్యాట్ యథాతథ స్థితి
Published Thu, Mar 12 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement