సీసీఐకి మిల్లర్ల షాక్‌! | CCI Shocked By Millers In Karimnagar District | Sakshi
Sakshi News home page

సీసీఐకి మిల్లర్ల షాక్‌!

Published Sun, Aug 18 2019 12:48 PM | Last Updated on Sun, Aug 18 2019 12:49 PM

CCI Shocked By Millers In Karimnagar District - Sakshi

జిన్నింగు మిల్లు

సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్‌): కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణ పత్తి మిల్లర్లు షాకిచ్చారు. 2019–20 సీజన్‌కు సంబంధించి జిన్నింగ్, బేళ్ల తయారీకి సీసీఐ ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. రాష్ట్రం నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. సీసీఐ అమలు పరుస్తున్న నిబంధనలను నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు గడువు ముగియడంతో ఆ సంస్థ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీజన్‌ సమీపిస్తుండడంతో వ్యవహారం రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చెంతకు చేరినట్లు తెలుస్తోంది.

మద్దతు ధరల కోసం..
తెలంగాణలో పత్తి క్రయవిక్రయాల సీజన్‌ అక్టోబర్‌లో మొదలవుతుంది. నవంబర్‌ నుంచి కొనుగోళ్లు ఊంపదుకుని మార్చి వరకు నడుస్తాయి. ప్రధాన మార్కెట్లలో ఏడాది పొడవునా అమ్మకాలు సాగుతాయి. యార్డులో తొలుత ప్రైవేటు వ్యాపారులే పత్తి కొంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నూలు, దూది డిమాండ్‌ను బట్టి స్థానికంగా పత్తి ధరలు నిర్ణయిస్తారు. రైతులు తెచ్చే సరకుల్లో తేమ, పింజ పొడవుకు అనుగుణంగా తేడాలు వేస్తారు. మార్కెట్లో ధరలు పతనమైతే మద్దతు ధరల కల్పనకు సీసీఐ రంగంలోకి దిగుతుంది. సరకుల నాణ్యత పరీక్షించి నాలుగు గ్రేడ్లుగా విభజిస్తుంది. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉన్న విడిపత్తినే కొంటుంది. నిబంధనల మేరకు ధరలు నిర్ణయించి రొక్కాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో పత్తికి డిమాండ్‌ పెరిగితే వాణిజ్య కొనుగోళ్లూ చేపడుతుంది. ఇలా వివిధ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సరకులను సమీపంలోని జిన్నింగు మిల్లులకు తరలించి దూదిగా మారుస్తుంది. బేళ్ల రూపంలో దూదిని నిల్వ చేసి, సమయానుకూలంగా వ్యాపారం నిర్వహిస్తుంది. బేళ్ల ఎగుమతిలోనూ సీసీఐ పాత్ర కీలకం.

టెండర్లకు దూరంగా మిల్లర్లు..
సీజన్‌కు ముందే సీసీఐ అధికారులు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తారు. సేకరించే పత్తిని జిన్నింగు, ప్రెస్సింగు చేసి బేళ్లుగా మార్చేందుకు సమీపంలోని పత్తి మిల్లుల నుంచి ఆన్‌లైన్‌ టెండర్లు ఆహ్వానిస్తారు. నిబంధనల ప్రకారం కోట్‌చేసిన వ్యాపారులకు పనులు అప్పగిస్తారు. ఈ తంతు ఏటా నిర్వహిస్తారు. కాగా.. గతంలో పత్తి జిన్నింగు, ప్రెస్సింగు కలుపుకొని బేలు తయారీకి రూ.1050 చొప్పున మిల్లర్లకు చార్జీ ఇచ్చేవారు. 2013–14 సంవత్సరం నుంచి 2017–18 వరకు ఈ ధరనే వర్తింపజేశారు. 2018–19 నుంచి సీసీఐ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. బేలు తయారీ చార్జీని రూ.1104 దాకా పెంచారు. దీనికితోడు మిల్లర్లకు లింట్, ట్రాష్, షార్టేజీ లింకు పెట్టారు. క్వింటాలు పత్తి నుంచి తీసే లింట్‌ (దూది) శాతాన్ని ఒకే సీజన్‌లో 30.9 నుంచి 33 కిలోలకు పెంచుతూ(నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు) పోయారు. క్వింటాలు పత్తిలో షార్టేజీని 3.25 నుంచి 2.25 శాతం వరకు, దూదిలో ట్రాష్‌(దుమ్ము)ను 3.5 నుంచి 2.5 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు.

వ్యతాస్యం ఏర్పడితే మిల్లర్లకు ఇచ్చే చార్జీల్లో కోత విధించారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించినా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ జోక్యంతో అమలుపర్చారు. ఈ విధానం నష్టాలు కలిగించడంతో బేళ్ల తయారీకి మిల్లర్లు వెనకడుగు వేశారు. సీజన్‌లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరికి తలొగ్గారు. ఈ క్రమంలో 2019–20 సీజన్‌ కోసం జూలై 26న సీసీఐ టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న టెండర్లు తెరిచిన సీసీఐ అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంలో 350 పత్తిమిల్లులు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 45 పత్తి మిల్లులు ఉండగా.. ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. సీసీఐ షరతులపై విముఖంగా ఉన్న వ్యాపారులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేళ్ల తయారీకి ఇస్తున్న చార్జీని మరింత పెంచాలని, లింట్, ట్రాష్, షార్జేజీ శాతాన్ని సడలించాలనే పట్టుతో ఉన్నారు. దీనిపై పునరాలోచనలో పడిన భారత పత్తి సంస్థ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

సర్కారు దరికి సమస్య..
సీసీఐకి వ్యాపారులకు మధ్య తలెత్తే వివాదాలపై రాష్ట్ర సర్కారే చొరవ చూపుతోంది. నిరుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా మార్కెటింగ్‌శాఖ జోక్యం చేసుకుని సమస్యకు తెరదింపింది. ఈయేడు మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 లక్షల హెక్టార్లలో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 18 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. మరో నెలన్నరలో పత్తి క్రయవిక్రయాల సీజన్‌ మొదలు కానుండగా.. రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొంది.

మద్దతు ధరల కల్పనకూ ఇది అనివార్యం. రాష్ట్రంలో సీసీఐ ఏటా సుమారు 150 కేంద్రాలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 కేంద్రాలను నెలకొల్పుతోంది. జిన్నింగు మిల్లుల సమస్య తీర్చకుంటే పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతారు. రైతుల శ్రమఫలాన్ని గద్దల్లా తన్నుకుపోతారు. మార్కెట్లోనూ ధరలు పతనం అవుతాయి. సీసీఐ, మిల్లర్లకు మద్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ దరికి చేరింది. రేపోమాపో ఇరువర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement