గంగానది తరహాలో గోదావరి, కృష్ణా | Central Government Revival Krishna And Godavari Rivers | Sakshi
Sakshi News home page

జీవనదులకు పచ్చలహారం

Feb 16 2020 3:12 AM | Updated on Feb 16 2020 3:12 AM

Central Government Revival Krishna And Godavari Rivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర జీవనాడి.. గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. గంగానది తరహాలోనే దేశం లోని 9 జీవనదుల పరీవాహక ప్రాంతాల్లో అటవీ ప్రాంత అభివృద్ధి, పర్యావరణ సమతౌల్యత ద్వారా పునరుజ్జీవం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇరువైపులా 5 కి.మీ., వాటి ఉప నదులకు ఇరువైపులా 2 కి.మీ.ల మేర ప్రాంతా న్ని అభివృద్ధి చేయనుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆ ప్రాంతంలో అటవీ క్షేత్రాలు, ఉద్యానతోటల పెంపకాన్ని చేపట్టనుంది. ఈ పరిధిలోని ప్రైవేటు భూముల్లోనూ ఇదే తరహా అభివృద్ధి జరగనుంది. వాటర్‌షెడ్‌లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడమే కాకుండా నదులు కోతకు గురికాకుండా చర్యలు తీసుకోనుంది. గోదావరి, కృష్ణా నదులు, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో సుమారు 52 లక్షల ఎకరాల పరిధిలో ఈ రకమైన అభివృద్ధి చేయనున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికా రి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం రెవె న్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి శాఖలు మార్చి 10కల్లా ప్రతిపాదనలతో కూడిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. వాటిని క్రోడీకరించాక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను పంపనుంది. ఈ ప్రక్రియ మార్చి నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఆ తర్వాత కేంద్రం తన పని ప్రారంభించనుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఎందుకు చేస్తున్నారంటే...! 
దేశంలో ఏర్పాటైన మొదటి ఇరిగేషన్‌ కమిషన్‌ నది పరీవాహక ప్రాంతాల్లో ఉపరితల ప్రవాహం ఏడాదికి 116.76 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం)గా అంచనా వేసింది. 1949లో ఈ ప్రవాహాన్ని కోస్లా ఫార్ములాలో లెక్కించగా 125.529 బీసీఎంగా తేలింది. సగటు ప్రవాహాన్ని 11.54 బీసీఎంలుగా నిర్ధారించారు. అయితే నదుల్లో ఏటా 0.99 బీసీఎంల నీరు కాలుష్యం బారిన పడుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. గోదావరిలో ఏటా 4.34 హెక్టార్ల నేల కోతకు గురవుతుండగా, 23.22 హెక్టార్ల నేల అవక్షేపాలతో నిండిపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో కృష్ణా 23 శాతం, 38 శాతం గోదావరి నది ఆక్రమించి ఉన్నాయి.

ఇప్పుడేం జరుగుతోంది..? 
గంగా నదీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టగా ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక తయారీ ప్రక్రియ 2016లో మొదలైంది. ఆ సమయంలో ఈ నివేదిక తయారు చేస్తున్న డెహ్రడూన్‌లోని అటవీ అధ్యయన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ) ద్వారా దేశంలోని ప్రధాన జీవనదులను పునరుద్ధరించేందుకు పూర్తిస్థాయి నివేదికలు తయారు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎఫ్‌ఆర్‌ఐ తన ప్రాంతీయ సంస్థల ద్వారా యమున, గోదావరి, కృష్ణా, నర్మద, కావేరి, మహానది, సట్లెజ్, బ్రహ్మపుత్ర, లూనీ నదుల పునరుజ్జీవానికి నివేదికలు తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన కార్యాచరణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులకు పునరుజ్జీవ ప్రణాళికపై ఇప్పటికే ఓ దఫా శిక్షణ కూడా పూర్తయింది. వారంతా ఎఫ్‌ఆర్‌ఐ నిర్దేశించిన పద్ధతిలో గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి సంబంధించిన నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
 
పునరుజ్జీవం కోసం ఏం చేస్తున్నారంటే... 

  •  సహజ పర్యావరణ వ్యవస్థ (అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు)ను పరిరక్షించేందుకు నిర్దేశిత జోన్లలో భూమి, నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు కలుపు నియంత్రణ, మొక్కల పెంపకం లాంటి చర్యలు చేపడతారు. ఈ క్రమంలో పెంచాల్సిన మొక్కలను డెహ్రడూన్‌లోని ఎఫ్‌ఆర్‌ఐ ఆయా పరీవాహక ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తుంది. దీనినే నేచురల్‌ ల్యాండ్‌స్కేప్‌ అభివృద్ధిగా పరిగణిస్తారు. ఇందుకోసం రైతులు కూడా తమకు అనువైన మొక్క రకాలను ఎంచుకోవచ్చు. ఆవాస ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వాటి పెంపకం చేపట్టవచ్చు. అయితే రైతు ఎంచుకున్న మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేయడంతోపాటు సాగుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని కూడా నగదు రూపంలో అందజేస్తుంది. 
  •  అటవీ వ్యవసాయం కోసం నదీ పరీవాహక ప్రాంతం పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పంటల పెంపకాన్ని చేపడతారు. వ్యవసాయ, ఉద్యాన పంటలను పరీవాహక ప్రాంతాల్లోని ప్రైవేటు భూముల్లో రైతుల చేత పండిస్తారు. తద్వారా ఆ ప్రాంతంలో భూమి, నీటి సంరక్షణ చేపట్టడంతోపాటు ఆర్థిక ఫలాలనిచ్చే పంటలను ప్రోత్సహిస్తారు. 
  • మూడో పద్ధతిలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో జీవ పరిహారం, జీవ శుద్ధి కోసం మోడల్‌ సైట్స్‌ అభివృద్ధి చేస్తారు. నదీముఖ ప్రాంతం అభివృద్ధి చేయడం, ఎకో పార్కుల ఏర్పాటు, వ్యవస్థాగత, పారిశ్రామిక ప్రాంతాల్లో చెట్ల పెంపకం లాంటి చర్యలు చేపడతారు. 

గోదావరి, కృష్ణా నదుల స్వరూపం ఇది..
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించే గోదావరి నది తూర్పు దిశగా 1,465 కి.మీ. ప్రయాణిస్తుంది. తెలంగాణలోని నిజామాబాద్‌ కందకుర్తిలో మంజీరా, హరిద్రా ఉప నదులతో కలసి త్రివేణి సంగమంగా ప్రవేశించే గోదావరి నది మొత్తం 509.7 కి.మీ. మేర ప్రయాణిస్తుంది. దీనికి ఐదు ఉప నదులు మానేరు (230.3 కి.మీ), మంజీరా (310.2 కి.మీ), పెన్‌గంగా (72.2 కి.మీ), ప్రాణహిత (108.5 కి.మీ), వార్దా (39.6 కి.మీ) మన రాష్ట్రంలో ప్రవహిస్తాయి. ఇక మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మించే కృష్ణమ్మ మొత్తం 1,435 కి.మీ. ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో 7,420 చదరపు కి.మీ. పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న ఈ నది భీమా, డిండి, హాలియా, కృష్ణా, మూసీ, మున్నేరు, పాలేరు, పెద్దవాగు, తుంగభద్ర ఉప నదులను కలిగి ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement