విద్యుత్‌ చోరీ చేస్తే.. పేరు టాంటాం! | Central Mandate on Electricity theft | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చోరీ చేస్తే.. పేరు టాంటాం!

Published Sat, Jan 14 2017 1:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

విద్యుత్‌ చోరీ చేస్తే.. పేరు టాంటాం! - Sakshi

విద్యుత్‌ చోరీ చేస్తే.. పేరు టాంటాం!

‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ ప్రచారోద్యమం నిర్వహించాలని కేంద్రం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్న వారి పేర్లను ఎప్పటికప్పుడు ప్రకటించి వారిలో సిగ్గు కలిగించే రీతిలో ప్రచారోద్యమం (నేమ్‌ అండ్‌ షేమ్‌ క్యాంపెయిన్‌) నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. విద్యుత్‌ చౌర్యం నియంత్రించేందుకు ఈ ప్రచారం నిర్వహించాలని కోరింది. ‘ఉజ్వల్‌ డిస్కం అష్యూరెన్స్‌ యోజన (ఉదయ్‌)’ పథకానికి సంబంధించి కేంద్ర విద్యుత్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య ఈ నెల 4న త్రైపాక్షిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందం మేరకు డిస్కంలు తీసుకోవాల్సిన చర్యల్లో ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ ప్రచారోద్యమాన్ని కేంద్రం చేర్చింది.

నిర్దేశిత గడువుతో లక్ష్యాలు
డిస్కంల కార్యనిర్వహణ, ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత గడువులతో పలు లక్ష్యాలను విధించింది. ఆ వివరాలు
► వాస్తవ సరఫరా విలువ (ఏసీఎస్‌), వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌) మధ్య వ్యత్యాసాన్ని 2018–19లోగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి.
► ఫీడర్ల విభజనను మార్చి 2018లోగా పూర్తి చేయాలి. దీంతో వ్యవసాయానికి వాస్తవంగా సరఫరా అవుతున్న విద్యుత్‌ ఎంతో వెల్లడవుతుంది.
► నెలకు 500 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగిస్తున్న వినియోగదారులందరికీ 2018 డిసెంబర్‌ 31లోగా స్మార్ట్‌ మీటర్లను బిగించాలి. నెలకు 200 యూనిట్లకు మించి వినియోగించేవారికి 2019 డిసెంబర్‌ 31లోగా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
► 2017 జూన్‌ 30లోగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు, ఫీడర్లకు 100 శాతం మీటర్లు బిగించాలి.
►  గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ స్థాయి వరకు విద్యుత్‌ సరఫరాపై 2018 మార్చి 31లోగా ఆడిట్‌కు శ్రీకారం చుట్టాలి.
► విద్యుత్‌ సరఫరా లేని గృహాలకు 2018–19లోగా విద్యుత్‌ సదుపాయం కల్పించాలి.
► ప్రస్తుత వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్లలో కనీసం 10 శాతం పంపుసెట్లను మార్చి 2019లోగా ఇంధన పొదుపు సామర్థ్యమున్న పంపు సెట్లతో మార్చాలి.
► కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా పారదర్శక విధానంలో మాత్రమే విద్యుత్‌ కొనుగోళ్లు జరపాలి.
► అధికారుల వేధింపులు, విద్యుత్‌ చౌర్యం, భద్రత సంబంధిత ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు కేంద్రీకృత కస్టమర్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
► ఏటా వార్షికాదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లను సకాలంలో ఈఆర్సీకి సమర్పించాలి.
► నష్టాల తగ్గింపు, మీటరింగ్, బిల్లింగ్, బిల్లుల వసూళ్ల విషయంలో బాధ్యుడైన ప్రతి అధికారి పనితీరుకు సూచికల (కీ పర్ఫామెన్స్‌) విధానాలను ప్రవేశపెట్టాలి.

నష్టాలు తగ్గించుకోవాల్సిందే
త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. డిస్కంలు సాంకేతిక, వాణిజ్య సమ్మిళిత (ఏటీ అండ్‌ సీ) నష్టాలను ప్రస్తుతమున్న 12.29 శాతం నుంచి 2018–19 నాటికి 9.95 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో సరఫరా, పంపిణీ దశల్లో జరిగే విద్యుత్‌ తరుగుదలను సాంకేతిక నష్టాలుగా, పంపిణీ చేసిన మొత్తం విద్యుత్‌లో బిల్లుల చెల్లింపులు జరగని విద్యుత్‌ను వాణిజ్య నష్టాలుగా పరిగణిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే చౌర్యానికి గురైన విద్యుత్‌నే వాణిజ్య నష్టాలుగా పిలుస్తారు. మొత్తంగా ఈ రెండు రకాల నష్టాలను తగ్గించుకోవడానికి సబ్‌ డివిజన్, డివిజన్, సర్కిల్, జోనల్‌ స్థాయిల్లో లక్ష్యాలను నిర్దేశించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ డిస్కంలను ఆదేశించింది. నష్టాలు తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా గంటలను పెంచాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement