వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు
- ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించండి
- ఏడాదిలోగా సమర్పించండి: డిస్కంలతో ఈఆర్సీ
- లేదంటే 2015–16 లెక్కలతో టారిఫ్ నిర్ణయిస్తామని స్పష్టం
సాక్షి, హైదరాబాద్:ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ (డిస్కం)లను విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళిక సమర్పించకపోయినా, పథకంలో నిర్దేశించిన విధంగా 2017–18 నాటికి లక్ష్యాలు చేరుకోలేకపోయినా 2015–16 వ్యవ సాయ విద్యుత్ విక్రయాలను ప్రామాణికంగా తీసుకుని విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ వినియోగం, సరఫరా నష్టాల మదింపు కోసం మీటర్లు ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రణాళిక రూపొం దించి అనుమతి పొందాలని గతేడాది ఉత్తర్వు ల్లో సూచించినా డిస్కంలు శ్రద్ధ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
గడువులోగా మీటర్లు బిగించే లక్ష్యాన్ని పునర్ నిర్దేశించడం తప్ప కమిషన్‌కు మరో గత్యం తరం లేదంటూ 2017–18కి సంబంధించి ఇటీవల జారీ చేసిన టారీఫ్ ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. వ్యవసా య విద్యుత్ సరఫరా సమయాన్ని రాత్రిపూట 7 గంటల నుంచి పగటి పూటే 9 గంటలకు పెంచిన డిస్కంలు.. వచ్చే ఫిబ్రవరి నుంచి 24 గంటలు సరఫరా చేసేందుకు సమాయత్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిస్కంలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈఆర్సీ సూచించింది.
వ్యవసాయ విద్యుత్‌కు లెక్కల్లేవ్..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో ఉచిత విద్యుత్‌కు సంబంధించి కచ్చితమైన లెక్కలు డిస్కంల వద్ద లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ లో 25 శాతం వ్యవసాయానికి ఇస్తున్నట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈఆర్సీ ఆమోదించిన ఐఎస్‌ఐ విధానం ద్వారా ఈ అంచనాలు రూపొందిస్తున్న డిస్కంలు.. ఏటా ఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లో వీటినే సమర్పిస్తున్నాయి. డిస్కంలు సమర్పిస్తున్న అంచనాలను పరిగణలోకి తీసుకునే ఈఆర్సీ ఏటా విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తోంది. అయితే సరఫరా నష్టాలనూ వ్యవసాయ విద్యుత్ కింద లెక్కగట్టి నష్టాలు తగ్గించి చూపుతున్నాయని డిస్కంలపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యం లో వాస్తవ లెక్కల కోసం విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాజాగా ఈఆర్సీ ఆదేశించింది.
తొలుత నాగర్‌కర్నూల్‌లో
మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ డివిజన్ లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ఈఆర్సీ అనుమతి కోరింది. అనుమతులు లభించిన తర్వాత మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపింది.
6.5 శాతం పెరిగిన వినియోగం
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం 6.5 శాతం పెరిగిందని ఈఆర్సీకి డిస్కంలు తెలిపాయి. రెండేళ్లలో కొత్తగా 1,47,284 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడంతో ఈ మేరకు వినియోగం పెరిగిందని అంచనాలు సమర్పించాయి.