వ్యవసాయానికి విద్యుత్ దూరం చేసే కుట్ర
బోర్లకు మీటర్లు బిగించే వ్యూహం
అప్పు ఇచ్చిన బ్యాంకులకే వంతపాడుతున్న పాలకులు
ముందు విద్యుత్ మీటర్లు బిగించి ఆ తర్వాత బిల్లులు వేసే ఆలోచన
అదే జరిగితే రైతుపై నెలకు సుమారు రూ.3 వేల భారం
వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని సర్కారు చేస్తున్న కుట్రలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో
సుమారు 23 వేల ఉచిత విద్యుత్ సర్వీసులతో వ్యవసాయ బోర్లు\ వినియోగించుకుంటున్న రైతులు తమపై ఎక్కడ ఆర్థిక భారం పడుతుందో నని బెంబేలెత్తుతున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడులతో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను రుణమాఫీ పేరుతో నిలువునా ముంచిన ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని చూస్తోంది. మోటార్లకు మీటర్లు బిగించాలనే నిబంధన విధించడానికి ఎప్పటి నుంచో కసరత్తు చేస్తూ తాజాగా మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది కేవలం విద్యుత్ ఆడిట్ కోసమేనని పైకి చెబుతూనే మరో వంచనకు రంగం సిద్ధం చేస్తోందనే అనుమానం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
విశాఖపట్నం : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)కు సుమారు రూ.1250 కోట్లు నష్టం వాటిల్లిందని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్లు వేయడంతో పాటు ఐదు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీఉచిత విద్యుత్‌పై పునరాలోచించాలని షరతు విధించింది. దీంతో అంచెలంచెలుగా ఉచిత విద్యుత్‌ను దూరం చేసేందుకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
‘ఆధార్’ అందుకేనా
రైతుల నుంచి విద్యుత్ శాఖ ఆధార్ కార్డు నెంబర్లను సేకరిచింది. లైన్ లాస్ తగ్గించుకోవడానికి, వ్యవసాయానికి ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒక రైతుకు ఒక సర్వీసు మాత్రమే ఉండేలా.. అదీ నిబంధనలకు తగ్గట్టుగా ఉండేలా చర్యలు చేపట్టడానికి ఆధార్ అనుసంధానం చేశారు. అలాగే గృహ విద్యుత్ లైన్లను వ్యవసాయ విద్యుత్ లైన్ల నుంచి వేరు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి సర్వీసుకు మీటర్లు బిగించి నిర్ణీత యూనిట్లు దాటి వాడే విద్యుత్‌కు బిల్లు వేయడానికే ఈ తతంగం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నదాతపై ఆర్థిక భారం
వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్లు బిగించి చార్జీలు విధిస్తే రైతులపై ఆర్థిక భారం పడుతుంది. 5 హార్స్ పవర్ ఉన్న మోటార్‌కు గంటకు 3.8 యూనిట్ల చొప్పున రోజుకు 26.6 యూనిట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్ విద్యుత్‌ను రూ.3.75కు కొనుగోలు చేస్తోంది. ఆ భారం వ్యవసాయ విద్యుత్ సర్వీసులపైనా పడితే నెలకు రూ.2,992 బిల్లు ప్రతి 5హెచ్‌పి మోటారు వాడే రైతుకు వస్తుంది. అదే 7, 10 హార్స్ పవర్ మోటార్లకైతే బిల్లు తడిసిమోపెడవుతుంది. ఇంత భారాన్ని మోయడం అన్నదాతల వల్లకాక వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
రైతు నెత్తిన మరో పిడుగు!
Published Thu, Jul 14 2016 2:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement