మూడేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు..
పెద్దపల్లి: మూడేళ్ల మోదీ పాలనలో నయాపైసా అవినీతి ఆరోపణలు ఎదుర్కొలేదని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం "సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్" కార్యక్రమంలో మాట్లాడారు. మూడేళ్లలో కేంద్రం నుంచి లక్ష కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశామన్నారు. గత ప్రభుత్వాలు నింగి నుంచి నేలదాకా కుంభకోణాలకు పాల్పడ్డాయని విమర్శించారు. ఫసల్‌బీమా యోజన ద్వారా రైతులకు నయాపైసా నష్టం జరగకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, సంబంధిత నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేయకపోతే పన్నుల రూపంలో జరిమానాతోపాటు గ్రామాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఔషధ నియంత్రణ బీజేపీ ఘనతే
స్వాతంత్ర్య భారతంలో ఔషధ ధరలను నియంత్రించిన ఘనత బీజేపీకే దక్కిందని మంత్రి అన్నారు. ఔషధ కంపెనీలపై నియంత్రణ పెట్టడంతో పాటు ప్రజలకు చౌకగా మందులు అందించేందుకు జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, ఎన్‌టీపీసీ ఈడీ వివేక్ దుబే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్ పాల్గొన్నారు.