
'ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి'
మెదక్: తెలంగాణలో రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన మాట్లాడుతూ... నిరంతర విద్యుత్ కోతలతో అటు రైతులను, ఇటు ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు.
ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ మండలానికో నియోజకవర్గానికి ఒకరికి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాకాకుండా హరిజనులు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటూ వామపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం చేస్తామని చాడ వెంకట్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి హరీష్ రావు వామపక్ష పార్టీల నేతలైన చాడ, తమ్మినేనిలను కలసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ రోజు ఉదయమే కలసి కోరిన సంగతి తెలిసిందే.