
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం విక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యచారాలకు కారణం.. విచ్చలవిడిగా మద్యం దొరకడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు అపహరణకు గురైనా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంతమంది బాలికలు కిడ్నాప్, అపహరణకు గురయ్యారో పోలీసులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో కిరాణం కొట్టులు కూడా బెల్టు దుకాణాలుగా మారాయని విమర్శించారు. మద్యంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బెల్టు దుకాణాలు లేకుండా చూడాలని కోరారు. ఏపీ లాగా.. తెలంగాణలో కూడా మద్యపాన విక్రయాలు నియంత్రించాలని, మద్యాన్ని నిషేధించే వరకు సీపీఐ అధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలతో కలుపుకుని పోరాటం మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు.