
సాక్షి, కరీంనగర్ : ప్రతిపక్షాల అనైక్యతను అవకాశంగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని, కానీ ఇక్కడ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజా పాలన రాష్ట్రంలో కనుమరుగైందని, సీఎం కేసీఆర్ స్వాములు, గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ దోషిగా మారక తప్పదు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలపై తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలి ’ అని సూచించారు.