చర్చకు భయపడిన మంత్రి పెద్దోడా? | Challa Vasmichand Reddy Dares Jupally Krishna Rao on Palamuru Project | Sakshi
Sakshi News home page

చర్చకు భయపడిన మంత్రి పెద్దోడా?

Published Wed, Aug 23 2017 8:08 PM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM

Challa Vasmichand Reddy Dares Jupally Krishna Rao on Palamuru Project

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు ప్రజలకు ద్రోహం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు రావాలంటే భయపడుతున్నాడని, అలాంటి నాయకుడు పెద్దోడెలా అవుతాడని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఆయకట్టును తగ్గిస్తూ జీఓ వచ్చిందని, జీఓ మార్పును నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్‌ చేశారు. బహిరంగచర్చకు వచ్చే దమ్ములేని టీఆర్‌ఎస్‌ నేతలు, పచ్చి అబద్దాలు, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారని విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి జరిగిన నష్టం గురించి ప్రశ్నిస్తున్నానని, పదవులకోసం ప్రజలకు నష్టం చేసే మంత్రి జూపల్లిని చెంచా అని, తొత్తు అని అనకుండా ఇంకా ఏమంటారో చెప్పాలని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు.

నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జూపల్లి వంటివారు సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరుకు జరిగిన నష్టంపై చర్చించకుండా చిల్లర రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులపై దాడులు చేసి, తెలంగాణపై విషం చిమ్మినవాళ్లే టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్‌పై అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెనుకంజ వేశారని, అసెంబ్లీలోనే అవకాశం ఇస్తే టీఆర్‌ఎస్‌ అసలు రంగు బయటపడేదన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని వదిలిపెట్టేది లేదని.. అసెంబ్లీలోనే నిలదీస్తానని వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement