
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో పండించే బత్తాయిలో కొంత చేదుదనం ఉంటుంది. అలాంటి బత్తాయిని ప్రాసెసింగ్ చేసి పల్ప్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారు చేసి నిల్వ ఉంచడం సాధ్యంకాని పని. ఇక టమాటా కూడా అలాంటిదే. రాష్ట్రంలో పండించే టమాటాలు ప్రాసెసింగ్‌కు పనికిరావు. వాటి ద్వారా టమాటా సాస్ వంటివి తయారు చేయలేం. ఎంతో పేరున్న బంగినపల్లి మామిడి సహా ఇతర రసాలతో అనుబంధ ఉత్పత్తులు తయారు చేయలేం. మిర్చి, పసుపు తదితరాల ద్వారా అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకు అవి పనికి రావు’అని ఉద్యాన నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రతీ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎలా ఏర్పాటు చేయగలమనే సందేహం వ్యవసాయ శాఖ అధికారులను పట్టిపీడిస్తోంది.
ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి పరిశ్రమల శాఖ ముసాయిదా విధాన పత్రాన్ని సమర్పించింది. అయితే ఆ విధాన పత్రం రాష్ట్ర పరిస్థితులకు తగినట్లు లేదని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో అందులో మార్పులు చేయాలని, మరింత అధ్యయనం అవసరమని నిర్ధారణకు వచ్చారు. ప్రాసెసింగ్ యూనిట్లు లేని చోటే ఏర్పాటు చేసేలా ప్రోత్సాహకాలు ఉండాలని, అందుకు తగ్గట్లుగా పారిశ్రామిక వేత్తలకు వెయిటేజీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు ప్రయోజనం కలుగుతుందా లేదా అనే అంశాన్ని ఆధారం చేసుకొనే ఏర్పాటు చేయాలని సూచించింది.
మార్చాల్సిందే..
రాష్ట్రంలో ఆహార పంటలు అవసరానికి మించి పండుతుండటంతో వాటిని మార్కెటింగ్ చేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ సీజన్‌లో కిలో రూ.100 వరకు ఉండే టమాటా సీజన్‌లో రూపాయికి పడిపోతున్న పరిస్థితి ఉంది. మిర్చి ధర కూడా క్వింటా రూ.12 వేలు పలకాల్సింది పోయి రూ.3–4 వేలకు పడిపోతోంది. కంది, పెసర వంటి పప్పుధాన్యాలకూ మద్దతు ధర దొరకడం లేదు. ఈ నేపథ్యంలో విరివిగా వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మరోవైపు రాష్ట్రంలో పండించే పంట రకాలను ఆధారం చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఉదాహరణకు పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పండించే టమాటా రకమే సాస్‌కు పనికొస్తుంది. మన రకం టమాటా పనికిరాదు. కాబట్టి మన వద్ద ఉన్న పంట రకాలను మార్పు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే టమాటా, బత్తాయి, మిర్చి, మామిడి వంటి రకాలను మార్చాలి. అలా చేస్తేనే ప్రాసెసింగ్ యూ నిట్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
తాజా ఆహారమంటేనే ఇష్టం
ఇక దేశంలో ప్రజలు తాజా ఆహారాన్నే ఇష్టపడుతుంటారు. నిల్వ చేసిన పదార్థాలకు పెద్దగా ఆదరణ ఉండదు. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్లు ఏమేరకు లాభదాయకంగా ఉంటాయన్న అనుమానాలున్నాయి. అలాగే వ్యవసాయ పంటలు రెండు సీజన్లలోనే పండుతాయి. ఏడాది పొడవునా ఉండవు. కాబట్టి కేవలం సీజన్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తాయి. కాబట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారా అనే అనుమానాలూ ఉన్నాయి. దీంతో ప్రాసెసింగ్ యూనిట్లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమగ్ర అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.