9న ‘చలో చేవెళ్ల’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘చలో చేవెళ్ల’ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశాలను చేవెళ్ల నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ ఏ కార్యక్రమం చేపట్టినా నాంపల్లి దర్గాలో ప్రార్థన చేసిన అనంతరం రాజేందనగర్ ఆరే మైసమ్మ గూడిలో పూజలు, చిలుకూరి బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు, మెయినాబాద్ చర్చిలో ప్రార్థనలుచేసి చేవెళ్లలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారన్నారు.
ఆయన బాటలోనే తెలంగాణ వైఎస్సార్ సీపీ కూడా పయణిస్తుందన్నారు. జిల్లా విస్తృత సమావేశం 9వ తేదీ ఉదయం 11.30కు చేవెళ్లలోని కేజీఆర్ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమవుతుందని చెప్పారు. అటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని మిగితా జిల్లాల సమావేశాలు నిర్ణీత తేదీల్లో కొనసాగుతాయన్నారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశాలను ప్రారంభిస్తారన్నారు.
మొదట చేవెళ్లలో వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి పార్టీ జెండాను ఎగురవేస్తారని, అనంతరం కేజీఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ నాయకులు ఏనుగు మహిపాల్ రెడ్డి, ముస్తాఫా అహ్మద్, సూర్యనారాయణరెడ్డి, అమృతాసాగర్, కుసుమ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.