తెలంగాణకు చంద్రబాబు అన్యాయం
తెలంగాణ ద్రోహి చంద్రబాబు జెండాలను మోస్తున్న వారంతా సోయి తెచ్చుకుని ఆ పార్టీ జెండాను వదిలిరావాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
భువనగిరి :తెలంగాణ ద్రోహి చంద్రబాబు జెండాలను మోస్తున్న వారంతా సోయి తెచ్చుకుని ఆ పార్టీ జెండాను వదిలిరావాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి పట్టణంలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టిన ఆర్‌ఆండ్‌బీ రోడ్డు విస్తరణ పనులకు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజ ల పట్ల చంద్రబాబు కుట్రలు ఇంకా సాగుతున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్ తెప్పించారన్నారు.
తన హయంలోనే విద్యుత్‌శాఖలో తెచ్చిన పీపీఏల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తెలంగాణ ప్రజలకు కరెంటు లేకుండా చేయడమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించాలని చూస్తే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యను తీర్చడానికి సీఎం కేసీఆర్ చత్తీస్‌ఘడ్ నుంచి 3500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆక్కడినుంచి ఇక్కడికి విద్యుత్ మార్గం ఏర్పాటు చేయడానికి ఏడాది సమ యం పడుతుందని, అంతవరకు కొంత ఇబ్బంది తప్పదన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి బలైన బీబీనగర్ నిమ్స్‌ను పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డిని కోరారు. బునాదిగాని, పిలాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వలను యద్ధప్రాతి పదికన పూర్తిచేయడానికి అధికా రులతో సమన్వయం సమావేశం నిర్వహించాలని, యాదగిరిగుట్ట దేవస్థానం, భువనగిరి కోట వంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సభకు అధ్యక్షతన వహించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భువనగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సహకారం అందించాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ లింగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు అమరేందర్, నాగారం అంజయ్య, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, అతికం లక్ష్మినారాయణ, జనగాం పాండు, రాముగౌడ్ బీరుమల్ల య్య, మిర్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.