వర్గీకరణపై చంద్రబాబు స్పందించాలి
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నం
- ఎమ్మార్పీఎస్ నాయకుల అరెస్ట్
బంజారాహిల్స్ : మహానాడులో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీను నాయకత్వంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి ట్రస్ట్ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇప్పటికైనా స్పందించకుంటే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్ నాయకులు దండు సురేందర్, చింత ప్రభాకర్, నాగారం బాబు, కనకరాజు, మంచాల యాదగిరి, అంజయ్యతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన
చిక్కడపల్లి : వర్గీకరణకు సహకరించకుండా ఎస్సీలను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేశాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్ను కనకరాజు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబునాయడు దిష్టిబొమ్మను బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దహనం చేశారు. అనంతరం కనకరాజు మాట్లాడుతూ.. మహనాడు సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కె.మురళి, లక్ష్మణ్, సాయిలు, మంచాల యాదగిరి పాల్గొన్నారు.
ఓయూలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఏపీ సీఎం చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మను బుధవారం మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు చంద్రబాబునాయుడి పై నిప్పులు కక్కిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ, మహానాడు జరుగుతున్న నేపథ్యంలో స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో అలెగ్జాండర్, కొల్లూరి వెంకట్, కొంగరి శంకర్, నర్సింహ్మ, నగేష్, రమేష్, తిరుపతి, పిడుగు మంజుల పాల్గొన్నారు.