సాక్షి, రంగారెడ్డి జిల్లా/ మంచాల: ‘ఇంత అద్భుతమైన గుట్టలు.. వేల ఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లు గుర్తుకు వస్తున్నాయి. రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.’ అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటులో భాగంగా సోమవారం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ భూములపై ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.
మన జిల్లాతో పాటు నల్గొండ సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన హెలికాప్టర్‌లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం 11 నిమిషాల్లో రాచకొండలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి, రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు.
రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు న్.శ్రీధర్, టి.చిరంజీవులు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్‌లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 2.10గంటలకు హెలికాప్టర్‌లో తిరుగుపయనమయ్యారు.
జొన్నరొట్టె మస్తు మస్తు..
రాచకొండ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించడంతోపాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేక భోజనం తెప్పించారు. కేసీఆర్ జొన్నరొట్టె, చికెన్, చేపలతో భోజనం చేశారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుగుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌నున ప్రశంసించారు. రాచకొండకు కే సీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. దూరంగానే ఆపేశారు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్. దాదాపు 20సంవత్సరాలపాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంత వరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గుర య్యారు. తొలుత ఈ నెల 3వ తేదీనే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదా పడినట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత పదిహేను రోజులకాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు గత మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలు, 500మందికిపైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండయిన గుట్టల చుట్టూకూడా పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.
ఇది బంగారు కొండ!
Published Mon, Dec 15 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement