
సాక్షి, హైదరాబాద్: ఔషధాల సరఫరాలో నాసిరకాలపై ‘గోలీమాల్!’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ సంచికలో వచ్చిన కథనంపై ఔషధ నియంత్రణ పరిపాలన(డీసీఏ) అధి కారులు స్పందించారు. నాసిరకం మందుల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తామని డీసీఏ డీడీ వెంకటేశం అన్నారు. అనుమానాస్పదంగా ఉన్న అల్ట్రాసెట్ మాత్రల సరఫరాను పర్యవేక్షించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని డిస్పెన్సరీలో నాసిరకం మాత్రలను సరఫరా చేసిన అంశంపై ఖైరతాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ భవానీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.
ఆదర్శనగర్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని డిస్పెన్సరీ స్టోర్‌లను పరిశీలించారు. అల్ట్రాసెట్ మాత్రలు ఢిల్లీ నుంచి కర్నూల్‌లోని ఒక ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ మార్కెట్‌లోకి వచ్చాయని అధికారులు నిర్ధారించారు. మాత్రలో ఉండాల్సిన ఔషధాలు మోతాదు స్థాయిలో లేవని పరీక్షల్లో తేలింది. దీంతో వీలైనన్ని తనిఖీలు నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని శివబాలాజీ ఫార్మా ఏజెన్సీలో నాసిరకం అల్ట్రాసెట్ మాత్రలను సరఫరా చేసినట్లు గుర్తించారు. సైదాబాద్ ప్రాంతంలో ఏజెన్సీ అడ్రస్ ఉన్న ప్రదేశానికి అధికారులు వెళ్లారు. ఏజెన్సీ నిర్వాహకుడు కె.శ్రీధర్ కుటుంబసభ్యులు మాత్రమే ఉండడంతో అధికారులు వివరాలను సేకరించలేకపోయారు. ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి వివరాలు సేకరించి చర్యలు తీసుకోనున్నట్లు డీసీఏ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment