ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఎల్లారెడ్డిరూరల్: అటవీ ప్రాంతం శివారులో మేతకు వెళ్ళిన పశువులపై చిరుత పులుల దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. దీంతో పశువులను మేతకు తీసుకువెళ్ళేందుకు పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రధానంగా అడవులు అధికంగా ఉన్న ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, వర్ని, మాచారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, బిచ్కుంద తదితర మండలాల్లో ఇటీవల చిరుతపులి వరుసగా దాడులు చేయడంతో మేకలు, గొర్రెలు, లేగదూడలు మృతి చెందాయి. దీంతో పశువుల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నెల రోజుల్లో 12 మేకలు, 4 లేగ దూడలు..
చిరుతపులి గడిచిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు మండలాల్లో పశువులపై దాడులు చేయడంతో 12 మేకలు, గొర్రెలతో పాటు 4 లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. గత నెల 10న జిల్లాలోని లింగంపేట మండలంలోని సురాయిపల్లి అటవీప్రాంతంలో లింగంపేట మండల కేంద్రంలోని శంకర్ పంతులుకు చెందిన లేగ దూడపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. ఈనెల ఒకటిన ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాలలో గంగెడ్ల రమేశ్‌కు చెందిన 3 లేగ దూడలను చిరుత పులి పశువుల కొట్టంపై దాడి చేసి ఎత్తుకెళ్ళింది. వారం రోజుల్లో 3 లేగ దూడలను చిరుత ఎత్తుకెళ్ళిందని బాధితుడు తెలిపారు.
ఈనెల 8న ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలోని ఆంగోత్ లాల్‌సింగ్‌కు చెందిన రెండు మేకలపై చిరుతపులి తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో దాడి చేసి ఎత్తుకెళ్ళినట్లు బాధితుడు తెలిపారు. ఈనెల 15న లింగంపేట మండలంలోని ఎక్కపల్లితండాలోని మోజీరాంకు చెందిన రెండు మేకలను చిరుత హతమార్చింది. వారం క్రితం ఇదే ప్రాంతంలో రూప్‌సింగ్, రావుజీ, కిషన్‌లకు చెందిన 10 మేకలపై చిరుతదాడి చేసిందన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా చిరుతపులి దాడులు చేయడంతో పశువులను మేతకు తీసుకుని వెళ్లాలంటేనే భయమేస్తోందని పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.
అందని నష్ట పరిహారం..
వన్యప్రాణుల ద్వారా మృతి చెందిన పశువులకు, వణ్య ప్రాణుల ద్వారా దాడులలో గాయపడిన వారికి అటవీశాఖ నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తమకు బతుకుదెరువుగా ఉన్న మూగ జీవాలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా వీటిపై చిరుతపులి దాడులు చేసి హతమార్చడంతో జీవనోపాధి కోల్పోతున్నామని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు మృత్యువాత పడడంతో వాటికి రావాల్సిన నష్ట పరిహారంపై అధికారులకు విన్నవించినా ఇంతవరకు ఎలాం టి నష్ట పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పశువులు పోయిన వాటికి నష్ట పరిహారం అందిస్తే వాటి స్థానంలో మరో వాటిని కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చిరుతదాడిలో మృతి చెందిన వాటికి నష్ట పరిహారం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.
చిరుత దాడిలో మృతి చెందిన లేగ దూడ
రెండేళ్లైనా పరిహారం అందలేదు..
మేకలను మేతకు తీసుకువెళ్ళిన సమయంతో చిరుతపులి దాడి చేసి తన 5 మేకలను హతమార్చింది. దీనికి సంబంధించి రూ.30 వేల నష్టం వచి్చంది. నష్టం జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అటవీశాఖ అధికారుల నుంచి నష్ట పరిహారం అందలేదు.
– రావుజ్యా, సోమర్యాగడి తండా.
నష్ట పరిహారం వర్తించదు..
చిరుత దాడిలో మేకలు, గొర్రెలు మృతి చెందితే వాటికి నష్ట పరిహారం వర్తించదు. కేవలం పాడి పశువులు, మనుషులపై దాడులు చేస్తేనే వాటికి నష్ట పరిహారం అందుతుంది. లేగదూడలకు సంబంధించి అధికారులకు ప్రతిపాదనలు పంపిం చాం. నిధులు రాగానే వారికి అందజేస్తాం. పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి పశువుల ను మేతకు తీసుకెళ్లద్లు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– చంద్రకాంత్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment