అమ్మా..పింఛన్లు వస్తున్నయా?
వృద్ధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటామంతీ
నల్లగొండ జిల్లా గుడిమల్కాపురంలో ఫ్లోరైడ్ బాధితుడిని వాహనం దిగి పలకరించిన సీఎం
ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటన
త్వరలోనే వాటర్‌గ్రిడ్ పథకం {పారంభించేందుకు వస్తానన్న సీఎం
చౌటుప్పల్, న్యూస్‌లైన్: ‘‘అమ్మా పింఛన్ వస్తుందా..? భయపడాల్సిన అవసరం లేదు.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం.. వాటర్‌గ్రిడ్ ప్రారంభించేందుకు మళ్లీ వస్తా... ఇదే వేపచెట్టు కింద కూర్చొని అన్ని మాట్లాడుకుందాం.. సమస్యలన్నీ పరిష్కరించుకుందాం...’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వృద్ధులకు భరోసా ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వెళ్తూ మార్గమధ్యంలో వికలాంగులు, వృద్ధులతో సీఎం మాట్లాడారు. సీఎం వెళ్లే సమయంలో గుడిమల్కాపురంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ఫ్లోరైడ్ బాధితుడు చెయ్యెత్తి సీఎంకు నమస్కారం చేశాడు. అది అలాగే గుర్తుంచుకున్న కేసీఆర్.. తిరుగు ప్రయాణంలో అక్కడే కూర్చున్న బాధితుడిని చూసి కాన్వాయ్ ఆపారు. వాహనం నుంచి దిగి ఆ వికలాంగుడి వద్దకు వెళ్లి పలకరించారు. సీఎంను చూసిన గ్రామస్తులు పెద్దఎత్తున గుమికూడారు. దీంతో కేసీఆర్ పింఛన్లపై ఆరా తీశారు. గ్రామస్తులతో 20 నిమిషాలపాటు మాట్లాడారు. వారి సంభాషణ ఇలా సాగింది.
సీఎం: నీ పేరే మిటి, వయసెంత?
ఫ్లోరైడ్ బాధితుడు: నా పేరు సుర్వి వెంకటేశం.. వయస్సు 50 ఏళ్లు.
సీఎం: అంగవైకల్యం ఎప్పట్నుంచి ఉంది?
వెంకటేశం: ఐదేండ్లున్నప్పట్నుంచి ఇలాగే ఉన్నా.
సీఎం: పింఛన్ వస్తుందా?
వెంకటేశం: రూ.500 వస్తున్నాయి. ఈ నెల ఇయ్యలే. వస్తదో, రాదో తెలియడం లేదు
సీఎం: ఏం ఆందోళన లేదు. వికలాంగులందరికీ పింఛన్లు వస్తయ్.
సీఎం: ఏమ్మా.. పింఛన్ వస్తుందా? (పక్కనే ఉన్న వృద్ధులు యశోదమ్మ, రాములమ్మ, బుచ్చమ్మలతో..)
యశోదమ్మ: 200 రూపాయలు వస్తున్నయి. ఈ నెల ఇయ్యలే, వస్తదో రాదో తెలుస్తలేదు. భయమేస్తుంది.
సీఎం: భయపడాల్సిన అవసరం లేదు, ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం
రాములమ్మ: సారూ.. భూములు, ఇండ్లు, మో టార్లున్నయని పింఛన్లు, రేషన్‌కార్డులు ఇయ్యరట.. నలుగురైదుగురు కొడుకులున్నా..
తల్లిదండ్రులను చూడడం లేదు. ఎక్కడ్నో పోయి బతుకుతుండ్రు. ఉన్న ఇండ్లు బువ్వ పెడుతయా? వృద్ధులందరికీ పింఛన్లు ఇయ్యాలె.
ఈ సందర్భంగా మరికొందరు మాట్లాడుతూ.. ‘‘మాకు సాగు జలాలు కూడా లేవు. భూములన్నీ పడావు పడ్డాయి. నక్కలగండిని చేపట్టాలి. తాగునీళ్లు కూడా సరిగా లేవు’’ అంటూ పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సీఎం స్పందిస్తూ.. ‘‘అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తయి. వచ్చేనెలలో వాటర్‌గ్రిడ్ ప్రారంభించేందుకు మళ్లీ వస్తా. ఇక్కడే ఇదే వేపచెట్టు కింద కూర్చొని అన్నీ మాట్లాడుకుందాం.. అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం’’ అని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ చిరంజీవులును పిలిచి తనతో మాట్లాడిన ఇద్దరు వృద్ధుల పేర్లు పింఛన్ల లిస్టులో ఉన్నాయో.. లేవో చూసి చెప్పాలని సూచించి, అక్కడ్నుంచి బయల్దేరారు. అనంతరం కలెక్టర్ లిస్టు చూసి.. సీఎంకు ఫోన్ చేసి వారిద్దరి పేర్లు ఉన్నాయని తెలిపారు.