తమ్ముడి పార్టీపై చిరంజీవి స్పందన
సాక్షి, హైదరాబాద్: తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ ఎజెండా ఏమిటో తనకు స్పష్టత లేదని కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ హటావో-దేశ్ బచావో’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ ఎజెండా ఏమిటో నాకే క్లారిటీ లేదు. మీకేం అర్థమైందో.. నాకూ అంతే అర్థమైంది. కాంగ్రెస్ హటావో అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి 125 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. గతంలో ఎంతోమంది బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూస్థాపితం చేస్తామన్నారు. అది సాధ్యమైందా? ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. ఏ పార్టీ కూడా మరో పార్టీని భూస్థాపితం చేయడమనేదే ఉండదు’’ అని పేర్కొన్నారు. తాను భారతీయుడినని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్సేనని, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందని చెప్పారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, జాతీయ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యాహక్కు వంటి విప్లవాత్మక చట్టాలను తెచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్సేనన్నారు. కాంగ్రెస్‌వైపు వేలెత్తి చూపేటప్పుడు మిగితా పార్టీల గురించి ఆలోచించాలని పవన్‌కు సూచించారు. రాష్ట్ర విభజనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయన్నారు. అన్ని పార్టీలూ అనుకూలమని చెప్పిన తరువాతే ఆఖర్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.
అలాంటప్పుడు ఒక్క పార్టీనే బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. విభజన విధానంతో మనసు గాయపడిందని పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను చిరంజీవి సమర్థించారు. ‘‘తమ్ముడు... విభజన తీరుతో నా మనసు బాధపడిందన్నాడు. అవును నిజమే. కానీ మిగిలిన పార్టీలు సమైక్య ముసుగులో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడంవల్లే అలా జరిగింది తప్ప కాంగ్రెస్ తప్పు లేదు’’ అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత కలిగిన పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి అని అన్నారు. సొంత పార్టీ పెట్టి సేవ చేస్తానని చెప్పడం పవన్ వ్యక్తిగత విషయమన్నారు. పవన్ పార్టీ ఏర్పాటు వెనుక టీడీపీ, బీజేపీ హస్తముందనే ఆరోపణలను ప్రస్తావించగా ‘‘ఏమో...నాకు తెలియదు’’ అంటూ వెళ్లిపోయారు.