అంజలి సినిమా చూసి ... | chit chat with Columbus director | Sakshi
Sakshi News home page

అంజలి సినిమా చూసి ...

Published Sat, Oct 24 2015 11:53 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

అంజలి సినిమా చూసి ... - Sakshi

అంజలి సినిమా చూసి ...

‘అంజలి’ సినిమా చూసి..సినీరంగంపై ఆసక్తిపెంచుకున్నా
అప్రెంటిస్ స్థాయి నుంచి డెరైక్టర్ స్థాయికి
‘కొలంబస్’ సినిమా డెరైక్టర్ రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
శుక్రవారం విడుదలైన ‘కొలంబస్’

 
ఇంటర్వ్యూ
‘నేను పుట్టి, పెరిగిన వరంగల్ జిల్లాయే నా ఆత్మ..నా గురువు. దాని ఒడిలోనే చదువు పాఠాలు..బతుకు పాఠాలు నేర్చుకున్నాను’ అని అంటున్నారు కొలంబస్ సినిమా దర్శకుడు(డెరైక్టర్) రమేష్ సామల. పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాక  స్నేహితులతో కలిసి సునీల్ థియేటర్లో సినిమా చూశాక ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది.

ఎలాగైనా సినిమాల్లోకి అడుగిడాలనే ఆ తపన..డిగ్రీ తర్వాత సాకారమైంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో అప్రెంటిస్‌గా మొదలైన రమేష్ ప్రస్థానం నేడు దర్శకుడి స్థాయికి చేరింది. ఆయన దర్శకత్వం వహించిన కొలంబస్ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా వరంగల్‌కు వచ్చిన రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.    - పోచమ్మమైదాన్
 
సాక్షి : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
రమేష్ : మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేళీ గ్రామం. వరంగల్‌కు వచ్చినప్పుడల్లా బంధువులు,స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతా. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టానికి కొంతమంది ప్రోత్సాహం చేదోడు తోడై నన్ను ఈస్థాయికి తీసుకెళ్లారు.
 
సాక్షి : సినిమా రంగంలోకే ఎందుకు ప్రవేశించాలనుకున్నారు?
రమేష్ : వరంగలే నా ఆత్మ.. నా గురువు. వరంగల్‌లో పుట్టడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. నాకు స్ఫూర్తి కూడా నా జిల్లానే. నేను పదోతరగతి పరీక్షలు రాశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి వరంగల్‌లోని సునిల్ థియేటర్‌లో అంజలి సినిమాకు వెళ్లాం. ఆ సినిమా చిత్రీకరించిన పద్ధతిని చూశాక.. ఎలాగైనా సినీరంగంలోకి అడుగిడాలనే తపన కలిగింది.

ఆ తపనను డిగ్రీ అయిపోయే వరకు అణచుకున్నాను. చాలామందిలో ఇలాంటి తపనలుంటాయి. అయితే తపనలు నెరవేరాలంటే ఓపిక, ప్రాక్టీస్, కృషి, అధ్యయనం అవసరమని గ్రహించాలి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే పెద్దలమాటను నేటి యువత గ్రహిస్తే విజయూలు ఏ రంగంలోనైనా సొంతం చేసుకోవచ్చు.
 
సాక్షి : సినీరంగంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఉందా?
 రమేష్ : నేను సినిమా థియేటర్లను గుడిగా భావిస్తా. ఎందుకంటే నాకు జీవితాన్ని, ఉపాధినిచ్చే పవిత్ర కేంద్రాలవి. అందుకే థియేటర్లకు గుడికి వెళ్లినంత భక్తిగా వెళ్లేవాణ్ని. డిగ్రీ చదివేరోజుల్లో.. ఆ తర్వాత కూడా వరంగల్‌లో నాకు మా ఇంటి కన్నా..అలంకార్ థియేటర్‌తో ఎక్కువ అనుబంధం ఉండేది.

ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికొచ్చినా అలంకార్ సినిమా థియేటర్ వద్ద కాసేపు ఆగేవాణ్ని. ఒకరోజు నేనొచ్చే సరికి అలంకార్ థియేటర్ లేదు. ఆ సందర్భంలో నేను నా ప్రాణమిత్రుణ్ని పోగొట్టుకున్నంత బాధపడ్డాను. ఆ ఘటన నాకు తీవ్ర ఆవేదన మిగిల్చింది.

సాక్షి : చదువుకునే రోజుల నుంచీ సినిమాలే మీ ఆసక్తా?
రమేష్ : నేను వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో ఇంటర్, డిగ్రీ కేఎన్‌ఆర్ కళాశాలలో పూర్తిచేశా. పదోతరగతి పరీక్షల తర్వాత అంజలి సినిమా చూసి సినిమాలపై పెంచుకున్న ఆసక్తి డిగ్రీ నాటికి మరింత పెరిగింది. సినిమా నిర్మాణం, దర్శకత్వం, సాంకేతిక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేవాణ్ని.

మిత్రులతో కూడా సినిమాలపై చర్చించేవాణ్ని. ఎవరైనా ఏదైనా రంగంలో ఎదగాలంటే ఆ రంగంపై అధ్యయనం చేయూలి. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి  సినీ అవకాశాలను వెతికాను. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.
 
సాక్షి : మహా సముద్రంలాంటి సినీరంగంలో అవకాశాలు ఎలా వెతికారు?

రమేష్ : మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టాన్ని లెక్కచేయొద్దు..ఇష్టంగా ముందుకుసాగాలి. నేనూ అదే చేశాను. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సినీరంగానికి చెందిన స్రవంతి రవికిశోర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాను. తర్వాత విజయభాస్కర్‌ను రవి కిశోర్ పరిచయం చేశారు. అప్పుడు విజయభాస్కర్ వెంకటేశ్ హీరోగా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తీస్తున్నారు. అందులో నన్ను అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. అక్కడ సినిమా నిర్మాణం, దర్శకత్వం, డైలాగ్ రైటింగ్‌లపై ఓనమాలు నేర్చుకున్నా.

సాక్షి : మీరు వివిధస్థాయిల్లో పనిచేసిన సినిమాలేవి?
రమేష్ : ఉషాకిరణ్ మూవీస్‌కు విజయభాస్కర్ పరిచయం చేశారు. దీంతో ‘ఇష్టం’ సినిమాలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమొచ్చింది. ఆపై ‘మన్మధుడు’ సినిమాకూ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. మల్లీశ్వరీ, తుఝే మేరీ ఖసం, జై చిరంజీవ, అతిథి,సలీం, రగడ, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్‌గా చేసే అవకాశాలొచ్చాయి. ఇష్క్ సినిమాకు అసోసియేట్ డెరైక్టర్‌గా, రచయితగా పని చేశాను. కొలంబస్ సినిమాకు డెరైక్టర్‌గా,డైలాగ్ రైటర్‌గా చేశాను.

సాక్షి : వరంగల్ జిల్లాలో సినీరంగం అభివృద్ధికి అవకాశాలున్నాయూ?
 రమేష్ : వరంగల్ జిల్లాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటం బాగా కలిసొచ్చే అంశం. ఇక్కడ మంచి లోకేషన్లున్నాయి. ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడి, భద్రకాళీ అమ్మవారి దేవాలయూలు చక్కటి లొకేషన్లుగా ఉపయోగపడతాయి.

నాకు ఎంతో ఇష్టమైన లొకేషన్‌లు ఇవి. ఎంఎస్ రాజు వర్షం సినిమాలో వరంగల్‌లో ఉన్న లోకేషన్లను పరిచయం చేశారు. తెరపై కొలంబస్ సినిమా ద్వారా వరంగల్‌కు చెందిన నన్ను పరిచయం చేశారు. త్వరలో నేను దర్శకత్వంవహించే సినిమాలను వరంగల్‌లో కొంత భాగం షూటింగ్ నిర్వహిస్తా.

సాక్షి: సినీరంగంలోకి ప్రవేశించాలనుకునే యువతకు మీరిచ్చే సందేశమేంటి?
రమేష్: కొత్తగా సినీరంగంలోకి రావాలనుకునే వారు మొట్టమొదట అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. నటన..డెరైక్షన్..మ్యూజిక్..డైలాగ్ రైటింగ్..ఎడిటింగ్..ఇలా ఏ విభాగమైనా కావొచ్చు. అవగాహన పెంచుకోవాలి. ఇంటర్నెట్లో..నిపుణుల పర్యవేక్షణలో ఎంచుకున్న విభాగంపై అధ్యయనం చేయూలి. ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. అవగాహన లేకుండా అవకాశాలు కావాలంటే కష్టం.

సాక్షి : మీ దర్శకత్వంలో విడుదలైన కొలంబస్ సినిమా గురించి చెప్పండి..
రమేష్ : కొలంబస్ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం 150 థియేటర్లలో విడుదలైంది. సుమంత్ అశ్విన్ హీరోగా, హీరోయిన్లుగా సీర త్ కపూర్, మీస్తి చక్రవర్తిలు నటించారు. సంగీత దర్శకునిగా జీతన్‌ను పరిచయం చేశాను. తొలిసారి నేను దర్శకత్వం వహించిన సినిమా విడుదలవడం ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చింది. నేను భాగం పంచుకున్న ప్రతి సినిమాను వరంగల్‌కే వచ్చి చూస్తా. అందుకే కొలంబస్ సినిమాను సైతం చూసేందుకు శుక్రవారం వరంగల్‌కే వచ్చాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఆనందంగా ఫిల్మ్ చూశా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement