బీవైనగర్ చర్చిలో క్రీస్తు సందేశం వినిపిస్తున్న పాస్టర్
సిరిసిల్లకల్చరల్: కరుణామయుడు, శాంతిదూత ఏసుక్రీస్తు జననం సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేకపూజలు చేయడం ప్రారంభించారు. మతపెద్దలు ఏసుక్రీస్తు బోధనలను చదివి వినిపించారు. జిల్లా కేంద్రంతోపాటు సమీప గ్రామాలు, వేములవాడ పట్టణం, అన్ని మండల కేంద్రాల్లోని చర్చిలు భక్తుల రాకతో కళకళలాడాయి. సిరిసిల్ల బీవై నగర్ రిజరెక్షన్ లైఫ్ మినిస్ట్రీస్, బెతెస్థ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్ ఐజాక్ ప్రసంగించారు. లోక కల్యాణకారకుడు క్రీస్తు జీవితం, ఆయన అనుసరించిన ప్రేమ మార్గం ప్రపంచ ప్రజానీకం శాంతియుతంగా జీవించేందుకు ఆచరణ యోగ్యమైనదన్నారు.
మానవ సమాజంలో శాంతి సాధనకు క్రీస్తు చూపిన మార్గమే శిరోధార్యమనిచెప్పారు. ఏసు ద్వారా అందిన శాంతి సందేశాన్ని అందరికీ చేరవేయడం ద్వారా ప్రజల జీవితాల్లో సుఖశాంతులను స్థాపింప జేయాలని కోరారు. రెవరెండ్ శ్యామ్ కల్వల ప్రత్యేక ప్రసంగం చేశారు. వేడుకల్లో దేవకర్ణతోపాటు సుమారు వెయ్యి మంది క్రైస్తవులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్ సీఎస్‌ఐ చర్చిలో సుధాకర్ ప్రసంగిస్తూ ప్రభువు చూపిన దారిలో పయనించే ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవ సమాజం పెద్దలు సత్యం బాబూరావు, అనంతరావు, సులోచన, నర్సయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో టీఆర్‌ఎస్ నాయకులు..
జిల్లాకేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, చిక్కాల రామారావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, ఎండీ సలీం తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, త్వరలోనే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment