► రెండేళ్ళుగా ఎదురుచూస్తున్న ఆశావాహులు
► నలుగురు మధ్య ఉన్న పోటీ ఇద్దరికే పరిమితం
► కమిటీ నియామకంపై దృష్టిసారించని ఎమ్మేల్యే
చిగురుమామిడి: మండలంలోని సుందరగిరి శ్రీవెంకటేశ్వరస్వామి చైర్మెన్ పదవి కోసం ఆశావాహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తున్నా ఆలయ అభివృద్ది కమిటీపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది. ఫలితంగా సుందరగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పలు అభివృద్ది పనులు నిలిచిపోతున్నాయి. చైర్మెన్ పదవి కోసం నలుగురు టీఆర్‌ఎస్ నాయకులు పోటీపడ్డారు. ఇందులో జంగ రమణారెడ్డి, బత్తిని సత్తయ్య, తాల్లపల్లి సంపత్, మిడివెల్లి వెంకటయ్యలు పోటీలో ఉన్నారు.
వీరిలో తాల్లపల్లి సంపత్ గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బత్తిని సత్తయ్యగౌడ్ సుందరగిరి గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షపదవిలో కొనసాగుతున్నారు. ఇక ఉన్నది ఇద్దరు మాత్రమే అయినప్పటికి ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. వీరిలో మిడివెల్లి వెంకటయ్యకు చిగురుమామిడి మండల జెడ్పీటీసీ సబ్యుడు వీరమల్ల చంద్రయ్య ఆశీస్సులతో, జంగ రమణారెడ్డి జెడ్పీ వైఎస్ చైర్మెన్ రాయిరెడ్డి రాజిరెడ్డి ఆశీస్సులతో పోటీలో ఉన్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.
ఒక దశలో అధ్యక్ష పదవి తనకే వచ్చినట్లు రమణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. గత సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించిన ఉత్తరద్వార దర్శన కార్యక్రమంలో ముగ్గురు కమిటీ సబ్యులతో ఆయన సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే మిగిలిందనే వాదనలున్నాయి. ఏదిఏమైనా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి పాలకమండలిని ప్రభుత్వం నియమించకపోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మేల్యే వొడితెల సతీష్‌కుమార్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.