కొత్వాల్‌ కొరడా! | CI, SI suspension in Mancherial | Sakshi
Sakshi News home page

కొత్వాల్‌ కొరడా!

Published Tue, Oct 31 2017 5:02 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

CI, SI suspension in Mancherial - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్‌ అధికారుల్లో వణుకు మొదలైంది. ఖాకీ దుస్తులు ఉన్నంత వరకు తమకు ఎదురు లేదని విర్రవీగిన అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏడాది తరువాత విక్రంజిత్‌ దుగ్గల్‌ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు.   కొత్వాల్‌గా అవినీతి, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే పోలీస్‌ అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు. ఇందులో భాగంగా భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధించిన మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలరాజును సోమవారం విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అలాగే ఓ భూ వివాదం పరిష్కారంలో సహాయపడిన తనకు మంచి మొబైల్‌ కొనివ్వమని కోరినట్లు వాయిస్‌ రికార్డ్‌లో దొరికిన సీసీసీ–నస్పూరు ఎస్‌ఐ దత్తాత్రిపై ఆదివారమే వేటు వేశారు. ‘సాక్షి’ దినపత్రికలో పోలీసుల అవినీతి, అక్రమాలపై వరుసగా వస్తున్న కథనాలకు స్పందించిన రామగుండం కొత్వాల్‌ విక్రంజిత్‌ దుగ్గల్‌.. ఆరాచక, బరితెగింపు పోలీసు అధికారులపై వేటు వేయాలనే నిర్ణయించుకున్నారు. ఆలస్యంగానైనా కమిషనర్‌ దుగ్గల్‌ తీసుకున్న నిర్ణయం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చర్చనీయాంశమైంది.  

శాంతిభద్రతల కన్నా... సివిల్‌ తగాదాలే ముఖ్యం
సివిల్‌ తగాదాలు, భూ లావాదేవీల్లో ఏదో ఒక వర్గానికి అండగా నిలిచి కేసులను పరిష్కరించడం, లక్షల్లో వసూలు చేయడం మంచిర్యాల జిల్లా పోలీసులకు సర్వసాధారణం అయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్నప్పుడే మంచిర్యాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగగా, భూ వివాదాలు కూడా అప్పటి నుంచే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల జోక్యం కూడా పెరిగింది. ఏదైనా భూ వివాదంలో రెండు వర్గాలు ఉంటే ఒక వర్గానికి అనుకూలంగా వ్యహరించి, అందిన కాడికి దండుకోవడం దందాగా సాగింది. జిల్లా ఏర్పాటు కాకముందు ఏఎస్పీగా పనిచేసిన ప్రస్తుత గద్వాల ఎస్‌పీ విజయ్‌కుమార్‌ హయంలో పోలీసులు సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకోవడం తగ్గింది. మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో విజయ్‌కుమార్‌ గద్వాల ఎస్‌పీగా వెళ్లగా, మంచిర్యాల రామగుండం పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ డీసీపీగా జాన్‌వెస్లీతో పాటు ముగ్గురు ఏసీపీలు నియమితులైనా... పోలీస్‌స్టేషన్‌లలో సాగే దందాలు ఆగలేదు.

సీఐ కన్నా ఉన్నతస్థానాల్లో ఉన్న వారే నేరుగా భూదందాల్లో జోక్యం చేసుకోవడం, పోలీసుల పర్యవేక్షణలో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయించడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. తాజాగా బస్టాండ్‌ వెనుక ఉన్న 13 ఎకరాల భూ వివాదంలో ఏకంగా ఏసీపీ చెన్నయ్య రూ.13 లక్షలు తీసుకున్నట్లు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. బెల్లంపల్లి ఏసీపీగా పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్‌ ఏసీపీల పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఇసుక, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు , గుట్కా, ఇతర అక్రమ వ్యాపారాలు చేసే వారితో పోలీసుల సంబంధాలు బహిరంగమే. కాగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ బాలరాజు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు రుజువయింది. బాలరాజును ఇక్కడి నుంచి రామగుండం కమిషనరేట్‌కు అటాచ్డ్‌ చేసి పంపించగా, ఎస్‌ఐ బాధ్యతలు చూస్తున్నారు. అయితే మహిళా పీఎస్‌లో ఫిర్యాదుదారుల పట్ల ఎస్‌ఐ వ్యవహారశైలిపై కూడా కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులతో సెటిల్‌మెంట్లు స్టేషన్‌లోనే జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.  

పెద్దపల్లి జోన్‌లోనూ అదే తీరు
రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి జోన్‌ (జిల్లా) పరిధిలో కూడా అవినీతి అక్రమాలకు కొదవలేదు. రామగుండం, పెద్దపల్లి ఏసీపీల పరిధిలో అక్రమార్కులకు పోలీసులు అండగా నిలవడం, నజరానాలు అందుకోవడం మామూలే. ఇటీవల బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిషేధిత గుట్కా రవాణాకు సంబంధించిన కేసులో గోదావరిఖనికి చెందిన ప్రధాన నిందితుడిని తప్పించడానికి ఓ ఎస్‌ఐ రూ. 5లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. సీఐ సెలవులో ఉన్న సమయంలో ఎస్‌ఐ టోల్‌గేట్‌ వద్ద వేర్వేరుగా రెండు లారీల్లో రవాణా అవుతున్న గుట్కా లోడ్‌లను స్వాధీనం చేసుకున్నాడు. ఈ క్రమంలో నాగరాజు అనే గుట్కా లోడ్‌లను తెప్పిస్తున్న ప్రధాన నిందితుడిని వదిలి లారీలో వస్తున్న అతని తమ్ముడిపై కేసు నమోదు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీస్‌ యంత్రాంగం ఇప్పటికీ ప్రయత్నిస్తోంది.

అలాగే  ఓ ఎన్‌టీపీసీ ఉద్యోగి, ఓ వీఆర్‌వో, వారి అనుచరులు ప్రతిరోజు గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని సిరోంచ, వాంకిడి ఆవల ఉన్న అటవీ ప్రాంతాలకు పేకాట రాయుళ్లను తీసుకెళ్లి ‘పత్తాలాట’ ఆడిస్తున్నారు. గతంలో బైండోవర్‌ అయిన ఈ అంతర్రాష్ట్ర పత్తాలాట ముఠా నాయకుడు, ఇతరుల గురించి తెలిసినా గోదావరిఖని పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో ఇక్కడ కూడా భూ వివాదాలు పెరిగాయి. అదే సమయంలో పోలీసుల జోక్యం కూడా పెరిగింది. మంథని పరిధిలో కూడా పలువురు సీఐలు, ఎస్‌ఐలపై ఆరోపణలు ఉన్నట్లు కమిషనర్‌ దృష్టికి వెళ్లింది.

ఏసీపీ, సీఐ, ఎస్‌ఐల ట్రాక్‌ రికార్డ్‌ పరిశీలన
మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల పరిధిలో పోలీస్‌ అధికారుల తీరు వివాదాస్పదం అవుతుండడంతో కొత్వాల్‌ విక్రంజిత్‌ దుగ్గల్‌ పోస్ట్‌మార్టం ప్రారంభించారు. తన కమిషనరేట్‌ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐల ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేసిన చోట వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో అవినీతి ఆరోపణలపై మంచిర్యాలకు చెందిన ఓ ఉన్నతాధికారిపై వేటు పడనుంది. పెద్దపల్లి డీసీపీ పరిధిలోని ఓ అధికారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  

స్టేషన్‌ల తనిఖీ
సోమవారం కమిషనర్‌ విక్రంజిత్‌ దుగ్గల్‌ జైపూరు ఏసీపీ పరిధిలోని నీల్వాయి పోలీస్‌స్టేషన్, కోటపల్లిలో ఉన్న చెన్నూరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో పోస్టు ప్రొడక్షన్‌ డ్రిల్‌ చేయించారు. వారి పనితీరును వాకబు చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement