ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడు ఎస్‌బీ సింగ్ కోసం సీఐడీ ముమ్మరంగా వేట సాగిస్తోంది.
ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో సీఐడీ విస్తృత గాలింపు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడు ఎస్‌బీ సింగ్ కోసం సీఐడీ ముమ్మరంగా వేట సాగిస్తోంది. ఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలను ఎస్‌బీ సింగ్ బయటకు తీసుకువచ్చాడని, ఆ ప్రశ్నపత్రాలతో తాను ఆరు క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చానని సీఐడీ కస్టడీలో మృతిచెందిన కమలేష్‌కుమార్‌సింగ్ వాంగ్మూలం ఇచ్చాడు. రెండున్నర నెలల నుంచి ప్రధాన నిందితుడు ఎస్‌బీ సింగ్ పరారీలో ఉంటూ.. సీఐడీని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎస్‌బీ సింగ్ తలదాచుకున్నట్టు సీఐడీ దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో అతడిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దించామని, పక్కా సమాచారంతో తమ బృందాలు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీకి వెళ్లాయని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సీఐడీ బృందాలు రెండు ప్రాంతాల్లో ఎస్‌బీ సింగ్ కోసం వేట సాగిస్తున్నాయి.