పసి‘గుడ్డు’ను చిదిమేశారు! | Cidimesaru pasiguddunu! | Sakshi
Sakshi News home page

పసి‘గుడ్డు’ను చిదిమేశారు!

Published Thu, Nov 13 2014 3:49 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

పసి‘గుడ్డు’ను చిదిమేశారు! - Sakshi

పసి‘గుడ్డు’ను చిదిమేశారు!

డాక్టర్ నిర్లక్ష్యంతో చూపుకోల్పోయిన పసికందు
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఓ పసికందు జీవితాన్ని అంధకారం చేసింది. శిశువు కంటి నుంచి నీరుకారుతోందని ఆసుపత్రికి తీసుకెళితే డబ్బు యావలో పడిన డాక్టర్లు జబ్బేమిటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. ఎమర్జెన్సీ చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చుక్కల మందుతో మమ అనిపించారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళితే స్థానిక ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది.

పుట్టిన నెలరోజుల్లోపు పసిపాప కంటికి ఉన్న సమస్యను స్థానిక వైద్యులు గుర్తిస్తే కంటిచూపు వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సమయం దాటిపోవడంతో శిశువు ఒక కన్ను చూపును పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆసలే ఆడపిల్ల... అందులోనూ ఒక కన్ను పూర్తిగా చూపుకోల్పోవడంతో నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని, సమస్యను గుర్తించిన వెంటనే తాము నేత్ర వైద్యురాలి వద్దకు పంపామని సదరు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు పేర్కొనడం గమనార్హం. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ సుభద్ర జలాల్ ఇచ్చిన నివేదిక లో పేర్కొన్న అంశాలు..

 చుక్కల మందుతో సరి..
 కరీంనగర్ బోయవాడకు చెందిన వి.స్వరూపకు మే 27న ఇద్దరు కవల పిల్లలు (ఆడ, మగ శిశువులు) జన్మించారు. 8వ నెలలోనే ప్రసవం కావడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అదేరోజున ఆ శిశువులను నగరంలోని పెటల్స్ నియో కేర్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ఎన్‌ఐసీయూలో పది రోజులపాటు శిశువులను ఉంచి పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ తరువాత డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆడ శిశువు (అవంతిక) కంటిలోనుంచి నీరు కారడం ప్రారంభించింది.

ఇది గమనించిన శిశువు తల్లిదండ్రులు జూన్ 16న మళ్లీ పెటెల్ నియో కేర్ ఆసుపత్రి డాక్టర్ వద్దకు వెళ్లగా చుక్కల మందు (ఐడ్రాప్స్) రాసిచ్చారు. అయినా తగ్గకపోవడం, దీనికితోడు శిశువు కంటిలో తెల్లని చుక్క కనిపించడంతో తల్లిదండ్రులు మళ్లీ జూలై 28న, సెప్టెంబర్ 1న రెండు దఫాలు అదే వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ కొన్ని మందులు రాసివ్వడంతో శిశువు తల్లిదండ్రులు స్థానిక శ్రీహర్ష కంటి ఆసుపత్రి వైద్యురాలి వద్దకు వెళ్లారు. అక్కడ కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు.

 వెలుగుచూసిన నిర్లక్ష్యం
 హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిన తల్లిదండ్రులు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శిశువును చేర్పించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణురాలు సుభద్ర జలాలి నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు 20 నుంచి 30 రోజుల్లోపు అంధత్వ నివారణ పరీక్షలు (ఆర్‌ఓపీ) నిర్వహిస్తే కంటిచూపు వచ్చేదని పేర్కొన్నారు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆ పరీక్షలు చేయకపోవడం, వ్యాధి నిర్దారణ చేయకుండానే చుక్కల మందు ఇవ్వడం వంటి నిర్లక్ష్య చర్యల వల్ల శిశువు కంటిచూపు పోయిందని తెలిపారు.

ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించడంతో నెలలు నిండకుండానే జన్మించిన శిశువుకు నిర్వహించాల్సిన పరీక్షలను వెల్లడిస్తూ మెడికల్ రిపోర్ట్‌ను రూపొందించడంతోపాటు పెటెల్స్ నియో కేర్ వైద్యుడికి లేఖ రాశారు. దీంతో నిర్ఘాంతపోయిన సదరు శిశువు తల్లిదండ్రులు ఆఖరి ప్రయత్నంగా చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లి ‘ఎంత డబ్బు ఖర్చయినా భరిస్తాం. పాప కంటి చూపు తెప్పించండి’ అని ప్రాథేయపడ్డారు. అక్కడి వైద్యులు సైతం అన్ని పరీక్షలు నిర్వహించి పాపకు ఒక కన్ను పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆ కంటికి ఇక చూపు వచ్చే అవకాశమే లేదని చెప్పడంతో రోదిస్తూ తిరుగుముఖం పట్టారు.

 డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
 - శిశువు తల్లిదండ్రులు
 నా బిడ్డ కంటిచూపు కోల్పోవడానికి పెటల్స్ నియో కేర్ హాస్పిటల్ డాక్టర్ కాసం శివకుమార్ కారణం. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. డాక్టర్‌పై కేసు నమోదు చేసి హాస్పిటల్ గుర్తింపును రద్దుచేయాలి. నా బిడ్డ వైద్యపరీక్షల కోసం నా అప్పుసప్పు చేసి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.

 మా తప్పేమీ లేదు
 - డాక్టర్ కాసం శివకుమార్
 స్వరూప దంపతుల కుమార్తెకు కంటి చూపు పోవడంలో మా తప్పేమీ లేదు. ఆ పాప పుట్టినప్పుడు రెండు కేజీల బరువుంది. దీనికితోడు శిశువుకు ఇన్‌ఫెక్షన్ సోకింది. పది రోజులు చికిత్స చేసి పంపాం. మావద్ద ఉన్నప్పుడు శిశువుకు ఎలాంటి సమస్యా రాలేదు. వాళ్లు ఇంటికి వెళ్లిన కొద్దిరోజుల తరువాత శిశువు కంటికి నీరు రావడంతో మళ్లీ కొన్నిసార్లు నా వద్దకొచ్చారు. నేను సమస్యను గుర్తించిన వెంటనే డాక్టర్ శ్రీలత వద్దకు పంపాను. కాబట్టి ఈ విషయంలో మా నిర్లక్ష్యమేమీ లేదు.

 ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి
 - డీవైఎఫ్‌ఐ
 ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈనెల 18న జిల్లా డీఎంహెచ్‌వో ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.కిశోర్, బీమాసాహెబ్, నగర అధ్యక్షుడు జి.తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement