రెండు రాష్ట్రాల మధ్య చేపల కూర చిచ్చు
రెండు రాష్ట్రాల మధ్య చేపల కూర చిచ్చు
Published Tue, Jun 13 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
- ఇరు రాష్ట్రాల కూలీల కొట్లాట
- 12 మంది కార్మికులపై కేసు
భద్రాచలంటౌన్: చేపల కూర ఇరు రాష్ట్రాల కార్మికుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనపై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పట్టణ అదనపు ఎస్సై బి.హరిసింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిపై జరుగుతున్న రెండవ వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికులు వలస వచ్చి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీహార్‌కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధమయ్యారు.
మద్యం సేవించి వచ్చిన వెస్ట్‌బెంగాల్‌కు చెందిన 12 మంది కార్మికులు చేపల కూర మాకూ కావాలని కోరారు. బీహార్ కార్మికులు ఇచ్చేది లేదని పేర్కొనటంతో వాగ్వాదానికి దిగిన వెస్ట్‌బెంగాల్ కార్మికులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని సెక్యూరిటీ సిబ్బంది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీహార్‌కు చెందిన కార్మికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పలు సెక‌్షన్‌ల కింద కేసును నమోదు చేసినట్లు ఎస్సై హరిసింగ్ పేర్కొన్నారు.
Advertisement