‘డబ్బు.. మహా పాపిష్టిది’ అన్నారు మన పెద్దలు.
దీనికున్న శక్తి అంతింత కాదు.
మనుషులను విడదీస్తుంది..
మమతానుబంధాలను దెబ్బతీస్తుంది..
మంచితనాన్ని హరిస్తుంది..
మోసగాళ్లుగా మారుస్తుంది..
మానవులను దానవులుగా మారుస్తుంది..
మానవత్వాన్నే చంపేస్తుంది..
జీవితాన్ని పరిహాసం చేస్తుంది.
సాక్షి, అశ్వారావుపేట: నిన్నమొన్నటి వరకు అతడొక నిరుపేద. అయితేనేం.. అతని బతుకు బండి సాఫీగా సాగిపోతోంది..! కష్టమనేది తెలీకుండా కళకళలాడుతున్నాడు..!!
ఆ నిరుపేద.. ఇటీవల ఒక్కసారిగా లక్షాధికారయ్యాడు. అతని బతుకు బండి తలకిందులైంది..! కష్టాల కడలిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు..!!
పోలవరం ముంపు బాధితుల్లో కొందరి జీవితాలు.. పరిహారపు సొమ్ముతో ఆగమాగమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామానికి చెందిన అతడి పేరు దానూరి వీరయ్య. ఆయన భార్య నాగలక్ష్మి. వీరికి ఇద్దరు పిల్లలు. పదేళ్ల క్రితం ఈ దంపతుల మధ్య గొడవలయ్యాయి. దీంతో భార్య వినాయకపురంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ పదేళ్లలో తన భర్త వద్దకు గానీ, పిల్లల వద్దకు గానీ ఎప్పుడూ రాలేదు. వీరయ్యకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. పోలవరం ముంపు కిందనున్న ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. బదులుగా, దానికి లెక్కగట్టి పరిహారం కింద 15 లక్షల రూపాయలను అతడి బ్యాంకు ఖాతాలో వేసింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన వీరయ్య భార్య నాగలక్ష్మికి ఈ విషయం తెలిసింది. అంతే.. ఆమెకు ఒక్కసారిగా భర్త, పిల్లలు గుర్తుకొచ్చారు! వెంటనే వీరయ్య ఇంటిపై వాలిపోయింది.
పాపం.. కల్లాకపటం, మాయామర్మం తెలియని ఆ వీరయ్య.. ఇన్నేళ్ల తరువాతైనా తన భార్య తననూ.. పిల్లలనూ వెతుక్కుంటూ వచ్చిందని సంబరపడ్డాడు. తనకు, ఇద్దరు బిడ్డలకు అండగా ఉంటుందనుకున్నాడు. ఇన్నేళ్ల తరువాత ఆమె ఇలా ఆకస్మికంగా ఎందుకు ఊడిపడిందోనన్న సందేహం ఏమాత్రం కలగలేదు. నాగలక్ష్మి, తానొచ్చిన పనిని చక్కబెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరయ్యతో, బిడ్డలతో ప్రేమ నటించింది. అతడు తన బ్యాంక్ ఏటీఎం కార్డును ఆమె చేతికిచ్చాడు. రహస్య అంకె చెప్పాడు. వచ్చిన రెండు నెలల తరువాత వినాయకపురం వెళ్లింది. నెల రోజుల క్రితం వీరయ్యకు డబ్బు అవసరమైంది. ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. మొత్తం 15 లక్షల రూపాయలకు గాను ఖాతాలో కేవలం 650 మాత్రమే ఉన్నాయి. అతడికి నోట మాట రాలేదు.
వినాయకపురం వెళ్లి భార్యను ప్రశ్నించాడు. ఆమె తెలివిగా.. ‘‘నువ్వు వెర్రిబాగులోడివి. తాగి డబ్బంతా పాడుచేస్తావు.. రేపు మన బిడ్డల భవిష్యత్తేమిటి..? అందుకే నా దగ్గర జాగ్రత్త చేశాను’’ అని చెప్పింది. అమాయకపు వీరయ్య గుడ్డిగా నమ్మేశాడు. వారం గడిచింది. వ్యవసాయ పెట్టుబడికి డబ్బు కావాలని భార్యను అడిగాడు. తన వద్ద లేదని చెప్పింది. వీరయ్యకు అనుమానమొచ్చింది. వినాయకపురం గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. ఖాతా నుంచి మొత్తం డబ్బును డ్రా చేశానని, అదే గ్రామంలోని తన ‘సన్నిహితుడు’ వల్లెపోగు విజయ్‌కు ఇచ్చానని చెప్పింది. విజయ్ నుంచి తీసుకుని ఇస్తానని చెప్పింది. నెల రోజులైంది. వీరయ్యకు ఆమె డబ్బు ఇవ్వలేదు.. వీరయ్య తట్టుకోలేకపోయాడు. అశ్వారావుపేట ఎస్‌ఐ అబ్బయ్యను ఆశ్రయించాడు. ఆమెను ఎస్‌ఐ విచారించారు. విజయ్ నుంచి తీసుకొచ్చి ఇస్తానని మళ్లీ చెప్పింది.
ఆ భార్యాభర్తలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. విజయ్‌ను ఆమె డబ్బు అడిగింది. ‘‘ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాను. ఇవ్వలేను’’ అని చేతులెత్తేశాడు. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. భర్తను తాను మోసగిస్తే.. తనను విజయ్ మోసగించాడని తెలుసుకుంది. గురువారం తన ఇంటి బాత్రూంలోకి వెళ్లి బ్లేడుతో మెడ కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్రంగా రక్తస్రావమవడంతో బంధువులు అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్వర పేటిక తెగడంతో మాటలు రావడం లేదని, పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వీరయ్య విలవిల్లాడాడు. ఆమె చేసిన మోసాన్ని మర్చిపోయాడు. భార్యను బతికించుకోవాలని తాపత్రయపడ్డాడు. కానీ, జేబులో రూపాయి కూడా లేదు. మదనపడుతున్నాడు. బంధువుల వద్ద రూ.30 వేలు అప్పు తీసుకుని భార్యకు వైద్యం చేయించేందుకు పెద్దాసుపత్రి బాట పట్టాడు. ఎప్పటి నుంచో అతడు నిరుపేద. మూడు నెలల క్రితం లక్షాధికారి. ఇప్పుడు మళ్లీ నిరుపేద. ‘పోలవరం పరిహారం.. నా జీవితాన్ని పరిహాసం చేసింది’ అని అతడు తల పట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment