సాక్షి, హైదరాబాద్ : ‘‘మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా అంశాల్లో వెనుకబడింది. ఈ పరిస్థితి రావడానికి ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలే కారణం. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. ఇందుకోసం ప్రజల ఎజెండా తయారు కావాలి. నిజంగా ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశం ఎటు పోవాలనే మార్గదర్శకం అవసరం. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నా. దేశ ప్రజలకు కావాల్సిన ఎజెండా రూపొందిస్తున్నా. ఈ ఎజెండాను యావత్ దేశం అంగీకరిస్తుంది.
దాని ప్రకారం రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు రూపొందించుకుంటే మార్పు తప్పక సాధ్యమవుతుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు కూడా నరేంద్ర మోదీపై వ్యతిరేకత వస్తే, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. అయితే ఏం లాభం? దేశానికి ఏం మేలు జరుగుతుంది? ఏం మార్పు సాధ్యమవుతుంది? ఒకరి మీద కోపంతో మరొకరిని గెలిపిస్తాం. ఎవరు గెలిచినా పరిస్థితిలో మాత్రం మార్పు రాదు’’అని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో వివిధ దేశాలకు చెందిన తెలంగాణ ఎన్నారై ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. అనంతరం వారితో తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం తదితర అంశాలపై మాట్లాడారు.
పదవుల కోసం కాదు..
‘‘నేను పదవుల కోసమో, ఇంకోదాని కోసమో జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఈ దేశ పౌరుడిగా, దేశంలో మార్పు తేవడానికి నా వంతు ప్రయత్నం ఏదైనా చేయగలనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని, పని మొదలుపెట్టా. మనకెందుకులే అనుకుంటే తెలంగాణ వచ్చేదా? మనకెందుకులే అని అందరూ అనుకుంటే దేశంలో మార్పు సాధ్యమవుతుందా? ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. మనం ప్రయత్నిస్తే మార్పు సాధ్యమవుతుంది. ఎన్నారైలు ఈ విషయాలను ప్రపంచవ్యాప్తంగా చర్చించాలి. ఉద్యమ సమయంలో మనమెందుకు పోరాడుతున్నామో అందరికీ చెప్పారు. మీరు చేసిన సహాయం, సహకారం ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మనం చేస్తున్న ప్రయత్నాలపైనా విస్తృత చర్చ పెట్టాలి’’అని సీఎం పిలుపునిచ్చారు.
దేశ పరిస్థితి బాగా లేదు
‘‘దేశంలోని ఒక రాష్ట్రంగా ఆలోచించినప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం బాగున్నామనిపిస్తుంది. కానీ మొత్తం దేశం పరిస్థితి బాగా లేదు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 40 వేల టీఎంసీలు వాడుకుంటే దేశం మొత్తం మీద ఉన్న 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ మాత్రం పని మన పాలకులు చేయలేదు. కేంద్ర బడ్జెట్ రూ.24.47 లక్షల కోట్లు. అందులో రూ.8.70 లక్షల కోట్లు అప్పుల కిస్తీలకు పోతాయి.
రూ.10 లక్షల కోట్లు జీతభత్యాలు, పెన్షన్లు వంటి నిర్వహణ ఖర్చుకు పోతాయి. రూ.ఐదారు లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్)కు సరిపోతాయి. ఇక మిగిలేది రూ.రెండు మూడు లక్షల కోట్లు మాత్రమే. కేవలం ఈ రెండు మూడు లక్షల కోట్లతో ఇంత పెద్ద దేశంలో అభివృద్ధి పనులు ఎలా సాగుతాయి? దేశం ఎట్ల బాగుపడాలి. ఎన్నడు బాగుపడాలి? ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, ఆందోళన. కులం పేరిట, మతం పేరిట ఘర్షణలు.
వీటికి పరిష్కారం లేదా? ఈ విషయాలను ఎన్నారైలు ఆలోచించాలి. మన పక్కనే ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారింది. మనమెందుకు మారడం లేదో ఆలోచించాలి’’అని సీఎం కోరారు. భారతదేశ ప్రజల ఎజెండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తున్న కృషిని ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా వివరించాలన్నారు. తెలంగాణ బిడ్డలుగా నాడు ఉద్యమ సమయంలో ఎలా సహకారం అందించారో, నేడు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయత్నంలో అలాగే భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రూ.50 కోట్లతో ఎన్నారై సెల్, కమిటీ
‘ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణకు చెందిన ఎన్నారైకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వెంటనే ఆదుకుని సహాయం అందిస్తుంది. ఇందుకోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం’అని సీఎం ప్రకటించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్‌కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్నారై కమిటీ వేయాలని సూచించారు. ఎన్నారై సెల్, కమిటీ ఏర్పాటు, అవి పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించాల్సిందిగా మంత్రి కె.తారక రామారావు, ఎంపీ కవితలను ఆదేశించారు.
తెలంగాణ ఎన్నారైల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ఈ సెల్, కమిటీ పని చేయాలని సూచించారు. ఎన్నారైల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.వంద కోట్లు కేటాయించామని, అందులోంచి రూ.50 కోట్లను సెల్‌కు బదిలీ చేస్తామని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కె.కవిత, ఎన్నారైల సమన్వయకర్త మహేశ్ బిగాల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment