సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లయినా గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏమాత్రం మారలేదని.. సర్కారు తుమ్మలు, మురికి కాలువలతో గ్రామాలు అధ్వానస్థితిలో ఉండటానికి సరైన చట్టాల్లేకపోవడమే కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శాసనసభలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.36 లక్షల మంది ప్రజాప్రతినిధులున్నా.. గ్రామాలు మాత్రం జవసత్వాలు లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పంచాయతీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు చేసి సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం దిశగా కొత్త చట్టాన్ని రూపొందించినట్టు స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదంతోనే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేలా సవరణలు చేస్తున్నట్టు తెలిపారు.
అప్పట్లో ఎస్‌కే డే తోడ్పాటుతో..
దేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ప్రధాని నెహ్రూ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అప్పటి అధ్యక్షుడు ఐసెన్ హోవర్ అక్కడ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న భారతీయుడు ఎస్‌కే డేను నెహ్రూకు పరిచయం చేశారు. ఎస్‌కేడే వల్ల అమెరికా గ్రామీణాభివృద్ధి చెందుతోందని ఐసెన్ హోవర్ ప్రశంసించారు. దాంతో నెహ్రూ ఎస్‌కే డేను భారత్‌కు రావాలని కోరినా.. ఆయన నిరాకరించారు. మూర్ఖుల చేతుల్లో ఉన్న భారతదేశానికి తాను రాలేనన్నారు. కానీ నెహ్రూకు కొన్ని సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నీళ్లు, గ్రామాల్లోని భూములు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం బాగుపడుతుందని ఎస్‌కే డే స్పష్టం చేశారు.
నెహ్రూ భారత్‌కు తిరిగొచ్చాక రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాజెక్టులపై దృష్టి సారించి.. భాక్రానంగల్, నాగార్జునసాగర్‌లను నిర్మించారు. ఇది గమనించిన ఎస్‌కే డే అమెరికా నుంచి రావడంతో.. నెహ్రూ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బా«ధ్యతలు అప్పగించారు. ఎస్‌కే డే హైదరాబాద్‌ను ఎంచుకుని ఎన్‌ఐఆర్‌డీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్)ని స్థాపించారు. దేశంలోనే మొట్టమొదటి బ్లాక్ పంచాయతీగా పటాన్‌చెరువును ఏర్పాటు చేశారు..’’అని కేసీఆర్ తెలిపారు. ఆ పంచాయతీకి మాజీ స్పీకర్ జి.రామచంద్రారెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యేలే భయపడేవారు..
గతంలో పంచాయతీ సమితి ప్రెసిడెంట్లు అంటే ఎమ్మెల్యేలు సైతం వణికిపోయేవారని.. అన్ని విశేష అధికారాలు కలిగి ఉండేవారని కేసీఆర్ చెప్పారు. టీచర్ల నియామకం, సిబ్బందికి జీతాల చెల్లింపు, పెంపు వంటి అన్ని అధికారాలు ఉండేవన్నారు. ‘‘నేను దుబ్బాక పాఠశాలలో చదువుకున్నప్పుడు సోలిపేట రామచంద్రారెడ్డి సమితి అధికారిగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేశాం. అలా ఉన్న గ్రామాలు ఇప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయాలు చేయడం, ఏకంగా హత్యలకు పాల్పడడం, ముఠాలు, వర్గాలుగా కేసులు పెట్టుకోవడానికి కేంద్రంగా మారిపోయాయి. దీనికి దేశంలోని అన్ని రాజకీయ పక్షాలే కారణం..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
మొక్కలు ఎండిపోతే.. సర్పంచ్‌ను తొలగింపు
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్‌లను తొలగిస్తూ కలెక్టర్ ఉదయం 11 గంటలకు ఆదేశాలు ఇస్తే.. రెండు గంటలలోపే కోర్టుల స్టే ఆదేశాలు వస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీలు అంటే సర్పంచులు మాత్రమే కాదని, గ్రామం మొత్తమని తెలియాలని పేర్కొన్నారు. సర్పంచులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం లేదనే తాము దగ్గరుండి మొక్కలు నాటుతున్నామన్నారు. కొత్త చట్టం ప్రకారం గ్రామంలో మొక్కలు చచ్చిపోతే సర్పంచును తొలగించడంతోపాటు ఆ గ్రామ కార్యదర్శిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తప్పించేలా చట్టంలో నిబంధనలు పెట్టామని కేసీఆర్ చెప్పారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అక్కడ గిరిజనులే ఉంటరు.
ఇప్పటివరకు గిరిజన తండాలు, గూడాలు కలిపి 631 ఎస్టీ గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని.. కొత్త చట్టం ప్రకారం 2,637 నూతన ఎస్టీ రిజర్వు పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు. అవి శాశ్వతంగా ఇదే రిజర్వేషన్‌తో కొనసాగుతాయని.. కేవలం పురుష, మహిళా విభాగం మారుతుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికి కలిపి జాయింట్ చెక్‌పవర్ ఇస్తున్నామని.. దానివల్ల ఇద్దరికీ సమాన గౌరవంతో పాటు బాధ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చే నిధులే తప్ప పంచాయతీలకు పెద్దగా నిధులు లేవని.. కానీ తాము దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పంచాయతీల కోసం రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీల కోసం రూ.1,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని వెల్లడించారు. చిన్న గ్రామానికి కూడా రూ.3 లక్షల వరకు నిధులు కేటాయించనున్నట్టు ప్రకటించారు. ఇవేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్ తదితర మార్గాల ద్వారా గ్రామాలకు నిధులు అందుతాయన్నారు.
నగర పంచాయతీల్లేవు.. మున్సిపాలిటీలే..
పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా ఉన్న వ్యవస్థలో.. ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవని కేసీఆర్ తెలిపారు. నగర పంచాయతీగా ఉండటం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని.. అందుకే వాటిని మున్సిపాలిటీలుగా మార్చుతున్నామని చెప్పారు. ప్రస్తుతం పురపాలక చట్టానికి సవరణలు మాత్రమే జరుగుతున్నాయని, త్వరలో కొత్త పురపాలక చట్టం తెస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కలిపి 147 అవుతున్నాయన్నారు.
గడువులోగా ఎన్నికలు జరుపుతాం
తాము తొలుత భావించినట్టుగా ప్రత్యేక సెషన్స్‌లోనే పంచాయతీ చట్టం తెచ్చి ఉంటే.. ఈ పాటికి ఎన్నికలు ముగిసి కొత్త సర్పంచులు వచ్చేవారని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 24న ఓటర్ల జాబితా ప్రకటించారని, దీనివల్ల పంచాయతీ చట్టాన్ని బడ్జెట్ సెషన్‌లో పెట్టామని తెలిపారు. అయితే ప్రస్తుతమున్న పాలకవర్గాలను రద్దు చేసే ఆలోచన లేదని.. గడువు ప్రకారమే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఇన్ని గ్రామాలు, ఈ పార్టీకి అన్ని గ్రామాలు అని అంకెలు ప్రకటించుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. కో–ఆప్షన్ వ్యవస్థపై సైతం సీఎం వివరణ ఇచ్చారు. ప్రతి గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నారైలు, ఆర్థికంగా గ్రామాలను ఆదుకున్నవారు ఉంటారని.. వారి సూచనలు, సలహాలు, సేవలు తీసుకొనేందుకు గ్రామ పంచాయతీయే వారిని గుర్తించి కో–ఆప్షన్ మెంబర్లుగా నియమించుకుంటుందని తెలిపారు. వారికి ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవని చెప్పారు.
కేంద్ర ఎరువుల విధానం దుర్మార్గం
రైతులు ఎరువులు తీసుకోవడానికి బయోమెట్రిక్, ఆధార్, పీఓఎస్ విధానం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. తాను దీనిపై పదే పదే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో మొత్తుకున్నా వినలేదని, దీనివల్ల రైతులు రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని.. గతంలో చెప్పులు లైన్లో పెట్టి, ఠాణాల్లో ఎరువులు కొనుగోలు చేసిన పరిస్థితి గుర్తుకువస్తోందని చెప్పారు. కేవలం రూ.3 వేల కోట్ల ఆదా కోసం కోట్లాది మంది రైతులను రోడ్ల మీదికి తీసుకొస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాలు..
రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కొత్త పంచాయతీల చట్టాన్ని ప్రవేశపెడుతోందని.. అర్ధరాత్రి బిల్లు కాపీలిచ్చి తెల్లారే చర్చ జరిపి ఆమోదింపజేసుకోవడం సరికాదని బీజేపీ శానససభాపక్షనేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కనీసం సభ్యులు పార్టీపరంగా చర్చించుకుని, మరింత సమగ్రంగా బిల్లు ఉండేలా కృషిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పారు. పంచాయతీల బిల్లుపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి, మరింత చర్చ జరిగాకే సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా ఇదే డిమాండ్ చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం రెండేళ్ల నుంచి తల పగిలిపోయేలా కృషి చేస్తున్నామని, అనేక మంది మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, నిపుణులతో చర్చించాకే బిల్లును రూపొందించామని చెప్పారు. రైతు సమన్వయ సమితులకు సర్పంచులకు సంబంధం లేదని... ‘శంకరాచార్యులకు–పీరీల పండుగకు ముడిపెట్టినట్టు’గా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రెండు బిల్లులకు సభ ఆమోదం
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ చట్టం, మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన పురపాలక చట్ట సవరణ బిల్లులను గురువారం శాసనసభ ఆమోదించింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment