సాక్షి, హైదరాబాద్: దేశానికే తిండిపెట్టే స్థాయి కి తెలంగాణ రాష్ట్రం ఎదగడం పట్ల గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. 2020 యాసంగిలో తెలంగాణ నుంచే తాము అత్యధికంగా ధాన్యం సేకరించినట్లు ఎఫ్‌సీఐ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను అభినందించారు. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు బాగా పండించారని సీఎం వ్యాఖ్యానించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డితో కలసి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ డీవీ ప్రసాద్ బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు.
2020 యాసంగిలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 63 శాతం తెలంగాణ నుంచి సేకరించగా, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి 37% సేకరించినట్లు డీవీ ప్రసాద్ వెల్లడించారు. కరోనా సవాళ్లను అధిగమించి ప్రభుత్వరంగ సంస్థలు ఈ సారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాయన్నారు. దేశవ్యాప్తంగా యాసంగిలో 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, అందులో తెలంగాణ నుంచే సగానికి పైగా సేకరణ జరిగిందని డీవీ ప్రసాద్ సీఎంకు వివరించారు. యాసంగిలో దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. దేశానికి కావాల్సిన ఆహారం అం దించడంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలి చిందని, దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారం గా అవతరించిందని ప్రసాద్ వెల్లడించారు.
ప్రతి గింజా కొనుగోలు..
కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. రాష్ట్రంలో 6,386 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. మరోవైపు తెలంగాణ నుంచి భారీగా ధాన్యం వస్తుండటంతో ఎఫ్‌సీఐ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. గతంలో విద్యుత్ సౌకర్యం, సాగునీటి వసతి లేకపోవడంతో వరి ధాన్యం, ఇతర పంటల దిగుబడి తక్కువగా ఉండేది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యవసాయ, రైతు సంక్షేమ చర్యలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలమట్టం పెరగటం, 24 గంటల ఉచిత విద్యుత్ వంటివి సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదం చేశాయి. 2019 యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2020 యాసంగిలో 39.5 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెరిగింది. దీంతో వరి ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment